Telugu Gateway
Telugugateway Exclusives

విచారణ ఆదేశించటానికి ఇంత సమయమా?

విచారణ ఆదేశించటానికి ఇంత సమయమా?
X

కాంగ్రెస్ సర్కారు తీరుపై అనుమానాలు?!

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ఖజానాకు ఓ గుదిబండగా మారబోతున్నట్లు కాగ్ తేల్చిచెప్పింది. పోనీ దీనివల్ల రైతులకు పూర్తిగా మేలు జరుగుతుందా అంటే అదీ లేదు. మేడిగడ్డ పిల్లర్ల పరిస్థితి ఏంటో రాష్ట్రమే కాదు..దేశం అంతా చూసింది. మిగిలిన బ్యారేజ్ లు కూడా ఇదే పద్దతిలో కట్టినందున అక్కడ కూడా ఇవే తరహా సమస్యలు వస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. దీంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితే అగమ్యగోచరంగా మారబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై చేసిన వ్యయం చాలా చాలా ఎక్కువని కాగ్ కూడా చెపుతోంది. తిరిగి ఈ ప్రాజెక్ట్ ను గాడిన పెట్టాలంటే మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఇందులో ఏకంగా లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆరోపించిన విషయం తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ ప్రాజెక్ట్ పై న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించింది. సిట్టింగ్ జడ్జి కోసం లేఖ రాస్తే కోర్టు సాధ్యం కాదు అని చెప్పింది. ఇది జరిగి కూడా చాలా రోజులు అయింది. మరో పది రోజులు పోతే రేవంత్ రెడ్డి సర్కారు కొలువుతీరి మూడు నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ విషయంలో అడుగులు ముందుకు పడకపోవడంతో దీనిపై అటు అధికారులతో పాటు కాంగ్రెస్ నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వివిధ పనులు చేసిన మెగా ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే విషయంలో రేవంత్ రెడ్డి తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు.

విచిత్రం ఏమిటి అంటే అధికారంలోకి వచ్చినప్పటి దగ్గరి నుంచి అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ..ఇటు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మెగా ఇంజనీరింగ్ పై ఒక్కటంటే ఒక్క విమర్శ చేయకపోవటం పలు అనుమానాలకు కారణం అవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెపుతున్న విచారణలో అయినా మెగా అంశాన్ని చేరుస్తారా లేక...మేడిగడ్డ, ఇతర బ్యారేజీల విషయానికే పరిమితం అవుతారా అన్న అనుమానాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక విషయం ఏమిటి అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ వ్యయం 3662 కోట్ల రూపాయలు అయితే..కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం నాలుగు ప్యాకేజీ ల్లోనే మెగా ఇంజనీరింగ్ కు దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది చేకూర్చినట్లు కాగ్ తన తొలి నివేదికలో పేర్కొంది. అంటే ఇది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ అన్న మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు, పుంపులు, ఇతర అనుబంధ పరికరాల సరఫరాకు సంబంధించి ఇది చోటు చేసుకున్నట్లు కాగ్ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. 2022 లో కాళేశ్వరం మోటార్లు మునిగిపోయిన సమయంలో నిర్మాణ కంపెనీనే ఈ ఖర్చు అంతా భరిస్తుంది అని అప్పటి బిఆర్ఎస్ మంత్రులు చెప్పుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే నిర్మాణ సంస్థ ఈ మోటార్లకు సంబంధించి కొత్తగా బిల్స్ పెట్టింది అని ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.

మోటార్లు పెట్టిన మెగా ప్రభుత్వానికి కనీసం ఇన్వాయిస్ లు ఇవ్వకపోయినా బిఆర్ఎస్ సర్కారు బిల్స్ క్లియర్ చేయటంతో పాటు ఆ కంపెనీకి మేలు చేసినట్లు కాగ్ గుర్తించింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చేయబోయే విచారణ పరిధిలో ఈ అంశాలు అన్ని చేరుస్తారా లేదా అన్న దానిపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్మాణ సంస్థతో పాటు గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కాపాడేందుకు ఇప్పటికే ఒక మీడియా అధినేత రంగంలోకి దిగినట్లు కూడా అటు రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. మరి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజలకు అనుమానాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా మెగా విషయంలో ప్రభుత్వ పెద్దల మౌనం ఈ అనుమానాలకు కారణం అవుతోంది.

Next Story
Share it