Telugu Gateway
Telugugateway Exclusives

ఓటుకు నోటు కేసు....టీఆర్ఎస్ లో చేరితే ఓకేనా?

ఓటుకు నోటు కేసు....టీఆర్ఎస్ లో చేరితే ఓకేనా?
X

సండ్ర పాత్రకు ఆధారాలున్నాయన్న తెలంగాణ ఏసీబీ

అధికారికంగా టీఆర్ఎస్ లో చేరికకు మార్గం సుగమం చేసిన కెసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ విషయానికి వస్తే అసలు దేశానికి తాము ఆదర్శం..తమ తర్వాతే ఎవరైనా అన్నట్లు మాట్లాడతారు. కానీ బయట రాజకీయం చూస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల కంటే రెండవ సారి ఎన్నికల్లోనే టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. అసలు విపక్షాల వైపు కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ అందుకు భిన్నమైన రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఫిరాయింపులపై చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిన కెసీఆర్ తాను అధికారంలోకి వచ్చాక మాత్రం అదే ఫిరాయింపులకు గేట్లు ఎత్తారు. అదేమంటే దానికి రాజకీయ ఏకీకరణ అనే సూత్రీకరణ ఒకటి. అదే పేరుతో కాంగ్రెస్ లో గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అది అంతా పాత కథే.

కానీ ఇప్పుడు సడన్ గా టీడీఎల్పీని కూడా టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. అసలు ఆ పార్టీ ఉనికే ఎప్పుడో ప్రశ్నార్ధంగా మారింది. ఈ విలీనం ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారని..ఇప్పుడు వారంతా టీఆర్ఎస్ లో విలీనం అవుతున్నారని చెప్పినట్లు అయింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య కీలక నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సండ్ర వెంకటవీరయ్య తనకు ఈ కేసుతో సంబంధం లేదని డిశ్చార్జ్ పిటీషన్ వేయగా..ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏసీబీ ఈ కేసులో సండ్ర వెంకటవీరయ్య కీలక పాత్ర పోషించాడని కోర్టుకు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వ తీరు ఉలా ఉంది అంటే..కేసు ఏదైనా ఎన్నికల సమయంలో వాడుకోవటం..తర్వాత దాన్ని అలా పక్కన పడేయటం అన్న చందంగా ఉంది. సీఎం కెసీఆర్ గతంలో చంద్రబాబునాయుడిని అయితే ఇక నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అంటూ ప్రకటనలు చేశారు. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. కానీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అది కాక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని టీఆర్ఎస్ అనధికారికంగా ఎప్పుడో తమ వైపు తిప్పుకుని..ఇప్పుడు మళ్లీ దానికి విలీనం పేరుతో అధికారిక ముద్ర వేసుకుంది. ఓటు నోటు కేసును సహించేదే లేదంటూ ప్రకటించిన కెసీఆర్ ఆ కేసులో నిందితుడిని పార్టీలో చేర్చుకోవటం ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు?

Next Story
Share it