Telugu Gateway
Telugugateway Exclusives

విజ‌య‌సాయిరెడ్డికి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ ఉండ‌దా?

విజ‌య‌సాయిరెడ్డికి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ ఉండ‌దా?
X

తెర‌పైకి వై ఎస్ అనిల్ రెడ్డి పేరు!

వైసీపీలో ఇప్పుడు కొత్త చ‌ర్చ ప్రారంభం అయింది. ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ ఛాన్స్ ఉంటుందా?. ఈ సారితో ఇక అంతే సంగ‌తులా?. వ‌చ్చే ఏడాది జూన్ నాటికే ఆయ‌న ప‌ద‌వి కాలం ముగియ‌నుంది. అందుకే ఈ చ‌ర్చ ప్రారంభం అయింది పార్టీలో. అంతే కాదు..త్వ‌ర‌లోనే ఆయ‌న్ను ఉత్త‌రాంధ్ర ఇన్ ఛార్జి బాధ్య‌త‌ల నుంచీ త‌ప్పించ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ళ‌తో పోలిస్తే సీఎం జ‌గన్, విజ‌యసాయిరెడ్డి మ‌ధ్య గ్యాప్ బాగా పెరుగుతూ వ‌స్తోంద‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయప‌డుతున్నాయి. అందుకే త్వ‌ర‌లోనే పార్టీలో కీల‌క మార్పులు ఉంటాయ‌ని ఆ వ‌ర్గాలు తెలిపాయి. అదే స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి స్థానంలో ఈ సారి రాజ్య‌స‌భ‌ సీటును వైఎస్ అనిల్ రెడ్డికి కేటాయించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కార‌ణాలు ఏమైనా జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా వైఎస్ ఫ్యామిలీలోని ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో సంబంధాలు ఒకింత దెబ్బ‌తిన్న‌ట్లు ప్ర‌చారం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు అండ‌గా నిలిచిన వైఎస్ ష‌ర్మిల ఏకంగా తెలంగాణ‌లో సొంత పార్టీ పెట్ట‌గా..ఆ పార్టీతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు. దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి భార్య‌, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ కూడా ష‌ర్మిల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నారు.

అదే స‌మ‌యంలో జ‌గన్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ‌హ‌త్య‌కు గుర‌వ‌టం, ఈ కేసు ఎంత‌కూ తేల‌క‌పోవ‌టంతో వివేకా కుమార్తె సునీత ప‌లుమార్లు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. తొలుత ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసిన జ‌గ‌న్ త‌ర్వాత అక్క‌ర్లేద‌ని చెప్ప‌టం అప్ప‌ట్లో పెద్ద దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాలు అన్నీ కుటుంబ స‌భ్యుల‌తో దూరం పెంచింద‌ని అంటున్నారు. దీన్ని సెట్ చేసుకునేందుకు ఈ సారి విజ‌య‌సాయిరెడ్డి స్థానంలో వైఎస్ అనిల్ రెడ్డికి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌టం ద్వారా కుటుంబ స‌భ్యుల‌ను చేర‌దీస్తున్నార‌నే సంకేతాలు ఇచ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభం అయ్యాయ‌ని వైసీపీ వ‌ర్గాలు తెలిపాయి. పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు విజ‌య‌సాయిరెడ్డికి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ ఉండ‌క‌పోతే మాత్రం ఇది కీల‌క ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ప్ర‌స్తుతం ఆయ‌న పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Next Story
Share it