Telugu Gateway
Telugugateway Exclusives

వైసీపీ 'జిన్ పింగ్ జ‌గ‌న్'!

వైసీపీ జిన్ పింగ్ జ‌గ‌న్!
X

ప్రాంతీయ పార్టీ ఏది అయినా అధ్యక్షుడి చేయి దాటిపోదు. ఎవ‌రైనా తోక జాడిస్తే అధ్యక్షుడే వాళ్ల‌ను బ‌య‌టికి పంపిస్తారు..లేక‌పోతే పోయేలా చేస్తారు. ఇది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఇప్పుడు ఏపీలో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ‌నివారం నాడు ముగిసిన ప్లీన‌రీలో వైఎస్ జ‌గ‌న్ ను వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ నుంచి ముందు జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల బ‌య‌ట‌కు వెళ్ళారు. తాజాగా వైఎస్ జ‌గ‌న్ తల్లి విజ‌య‌మ్మ కూడా పార్టీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌కటించారు. ఈ త‌రుణంలో ఆయ‌న త‌న‌ను శాశ్వ‌త అధ్యక్షుడిగా ప్ర‌క‌టించుకునేలా ఎందుకు చేశారు అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ సీనియ‌ర్ నేత ఇప్పుడు జ‌గ‌న్ ను వైసీపీ జిన్ పింగ్ గా అభివర్ణించారు. చైనా ప్రెసిడెంట్ గా ఉన్న జిన్ పింగ్ తాను రెండవ సారి అధికారంలోకి వచ్చాక జీవిత కాలం ఆ ప‌ద‌విలో ఉండేలా రాజ్యాంగాన్ని స‌వ‌రించారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేసి శాశ్వ‌త ప్రెసిడెంట్ గా ఎన్నిక‌య్యారు.

స‌హ‌జంగా ఏ ప్రాంతీయ పార్టీలో అయినా రెండు, మూడేళ్ల‌కు పార్టీ స‌మావేశం పెట్టుకుని లాంఛ‌నంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇది అత్యంత స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. కానీ జ‌గ‌న్ రెండు, మూడేళ్ల‌కు ఏదో రొటీన్ జ‌రిగే ఎన్నిక‌కు కూడా సిద్ధప‌డటం లేదా? అది కూడా ఇష్టం లేకే ఇప్పుడు ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారా అన్న చ‌ర్చ సాగుతోంది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న అస‌లు పార్టీ స‌మావేశాలు...నేత‌ల‌తో భేటీలు జ‌రిపిందే అతి త‌క్కువ. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక వంటి అత్యంత కీల‌క‌మైన అంశంలో కూడా ఎలాంటి స‌మావేశం లేకుండానే ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అంటే జ‌గ‌న్ ఏది అనుకుంటే పార్టీలో అదే జ‌రుగుతుంది. ఇందుకు ఏ ప్రాంతీయ పార్టీ మిన‌హాయింపు కాదు. అయితే కొంత మంది ఈ తతంగాన్ని ఏదో స‌మావేశాలు పెట్టి..ఏదో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తారు. అంతే తేడా. అయితే జ‌గ‌న్ అందుకు కూడా నో చెప్పేసి..తాను ఏది అనుకుంటే అదే అన్న స్ప‌ష్ట‌మైన సంకేతాలు పంపారు. అందుకే ఇప్పుడు ఆయ‌న్ను వైసీపీ జిన్ పింగ్ గా పిలుస్తున్నారు.

Next Story
Share it