Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారా...కావాల‌ని చేస్తున్నారా?!

కెసీఆర్ క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారా...కావాల‌ని చేస్తున్నారా?!
X

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కెసీఆర్ మాట‌లు చూస్తున్న వారెవ‌రికైనా ఇదే అనుమానం రాక‌మాన‌దు. నిన్న మొన్న‌టివ‌ర‌కూ దేశం నుంచి బిజెపిని, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని త‌రిమిత‌రిమికొడితే త‌ప్ప దేశం బాగుప‌డ‌దు అంటూ వ్యాఖ్యానించారు. దీని కోసం తాను న‌డుంక‌ట్టాన‌ని..అంద‌రితో మాట్లాడి బిజెపి సంగ‌తి తేలుస్తాన‌ని..ఢిల్లీలో అగ్గిపెడ‌తాన‌ని గ‌త కొంత కాలంగా ఎన్నోసార్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఈ మాట‌లు తెలంగాణతోపాటు దేశ ప్ర‌జ‌లు కూడా విన్నారు. ప‌నిలో ప‌నిగా త‌మిళ‌నాడు వెళ్ళి సీఎం స్టాలిన్, మ‌హారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్, ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేల‌ను కూడా క‌లిశారు. జార్ఖండ్ వెళ్లి సీఎం హేమంత్ సోరెన్ తో మాట్లాడారు. ఆ త‌ర్వాత సీన్ కట్ చేస్తే ఈ పార్టీలు అన్నీ కాంగ్రెస్ తో క‌ల‌సి ప్ర‌ధాని మోడీకి దేశంలోని ప‌రిస్థితుల‌పై ఓ లేఖ రాయ‌గా..క‌నీసం ఈ అంశంలో కూడా ఎవ‌రూ తెలంగాణ సీఎం కెసీఆర్ ను భాగ‌స్వామిని చేయ‌క‌పోవ‌టం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగానే మారింది. దీంతోనే కెసీఆర్ తో క‌ల‌సి వ‌చ్చేవారు ఎవ‌రూ లేర‌నే విష‌యం టీఆర్ఎస్ నేత‌ల‌కు కూడా బోధ‌ప‌డిన‌ట్లు ఉంది. అందుకే ప్లీన‌రీలో కెసీఆర్ ప్లేటు ఫిరాయించార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. నిన్న మొన్న‌టివ‌ర‌కూ బిజెపిని బంగాళాఖాతంలో క‌లుపుతామ‌ని మాట్లాడిన కెసీఆర్ ఆక‌స్మాత్తుగా ఇప్పుడు త‌మ ప‌ని ఎవ‌రినో దింపి..మ‌రెవ‌రినో ప్ర‌ధాని సీట్లో కూర్చోపెట్ట‌డం కాద‌ని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం త‌న‌ను క‌ల‌సిన క‌మ్యూనిస్టు జాతీయ నేత‌ల‌కు ఇదే విష‌యం చెప్పానన్నారు.

దేశానికి ఇప్పుడు కావాల్సింది ఫ్రంట్ లు..టెంట్లు కాదని..ప్ర‌త్యామ్నాయ విధానం కావాల‌న్నారు. కెసీఆర్ చెబుతున్న‌దే నిజం అనుకుందాం కాసేపు. ఆయ‌న మేధావులు...వివిధ రంగాల‌కు చెందిన నిపుణుల‌తో చ‌ర్చించి ఓ ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక సిద్ధం చేసినా కూడా దేశంలోని కీల‌క రాజ‌కీయ పార్టీల భాగ‌స్వామ్యం లేకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళ‌గ‌ల‌రు?. తెలంగాణ ప‌దిహేడు ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం. ఏ రాష్ట్రంలో ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు వారు..ఎవ‌రి రాజ‌కీయాలు వారు చూసుకునే నేత‌లు ఉన్న‌చోట ఇన్ని త‌క్కువ సీట్లు ఉన్న టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ చూపించే మార్గాన్ని సూప‌ర్..వావ్ అంటూ మిగిలిన పార్టీలు అన్ని ఎందుకు ఓన్ చేసుకుంటాయి. అస‌లు అది జ‌రిగే ప‌నేనా?. గ‌ద్దెనెక్కించాల్సింది పార్టీల‌ను కాదు..ప్ర‌జ‌ల‌ను అంట‌. అస‌లు ఈ మాట‌ల‌కు అర్ధం ఏమిటో. ప్ర‌జ‌లు గ‌ద్దెమీద కూర్చోవ‌టం అంటే ఏమిటి?. అస‌లు అది జ‌రిగే ప‌నేనా?. మ‌న‌కున్న వ్య‌వ‌స్థ‌లో మెజారిటీ సీట్లు సాధించిన‌వారే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కానీ.. ప్ర‌జ‌లు గ‌ద్దెనెక్క‌టం ఏమిటి?. తెలంగాణ‌లోనే కెసీఆర్ ప్ర‌జ‌లు గ‌ద్దెనెక్కే ప్రయోగం ఎలా ఉంటదో ఓ సారి చేసి చూపిస్తే దేశంలోని నేత‌లు అంద‌రూ కూడా తెలుసుకుంటారేమో.

Next Story
Share it