Telugu Gateway
Telugugateway Exclusives

అసెంబ్లీలో చంద్రబాబు 'నేలబారు' రాజకీయం

అసెంబ్లీలో చంద్రబాబు నేలబారు రాజకీయం
X

పద్దెనిమిది నెలలకే నేల మీద కూర్చుంటే..తర్వాత చేసేదేమిటి?

అధికారం కోల్పోయిన పద్దెనిమిది నెలలకే చంద్రబాబునాయుడు 'అసెంబ్లీ సాక్షిగా' నేల మీద కూర్చుంటే...మరో మూడేళ్లు ఏమి చేస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడు పోడియంలోకి ఆవేశంగా దూసుకెళ్ళి కింద కూర్చుంటే ఆయన ఏమి సంకేతం ఇచ్చినట్లు. అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ అంటే దేవాలయం, దేవాలయం లాంటిఅసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తనా అంటూ అధికారంలో ఉండగా సందేశాలు ఇచ్చిన చంద్రబాబే స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం చూసిన వాళ్లను కూడా షాక్ కు గురిచేసింది. ఓ ప్రతిపక్ష నేత ఇలా చేయటం ఇధే మొదటిసారి. ఇది ఓ అనూహ్య చర్య అయితే అత్యంత భారీ మెజారిటీతో ఎన్నికైన ముఖ్యమంత్రిని పట్టుకుని ఫేక్ సీఎం...జీరో సీఎం అంటూ వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేయటమే. జగన్ చెప్పిన అంశాల్లో తప్పులు ఉంటే ఆ తప్పులను ఎత్తిచూపాల్సిందే. అది సమర్ధవంతంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు. అంతే కాదు..చంద్రబాబుకు కావాల్సినంత మేర మీడియా మద్దతు కూడా ఉంది.

చంద్రబాబు కోణంలో చూస్తే రైతుల బీమా కట్టడంలో సర్కారు జాప్యం చేసిన మాటే నిజం అయి ఉండొచ్చు..పెన్షన్ల విషయంలోనూ ఎవరి వాదనలు వారివి. కానీ ప్రతిపక్షం తప్పును ఎత్తిచూపాలే తప్ప...ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకుపైగా సమయం ఉన్న తరుణంలో ఇఫ్పుడే ఇంత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఏమి చేస్తారు..చేయటానికి ఏమి మిగులుతుంది. అంటే అప్పుడు నేల మీద కూర్చోమని కాదు..ఎన్నికల సమయంలో అంటే రాజకీయం పీక్ కు చేరటం సహజం. అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఏపీ శాసనసభ సమావేశాలు జరిగింది ఐదు రోజులే అయినా ఈ ఐదు రోజుల్లోనే ఎన్నో వింత విన్యాసాలను ప్రజలు చూశారు. శుక్రవారంతో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేత తీరే కాదు..సభా నాయకుడి తీరు కూడా అంతే ఉంది.

Next Story
Share it