Telugu Gateway
Telangana

భయపెట్టి ఓట్లు కొల్లగొట్టే ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?!

భయపెట్టి ఓట్లు కొల్లగొట్టే ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?!
X

దేశానికే తలమానికమైన పాలన ఇచ్చామని నిన్న మొన్నటి వరకు చెప్పుకున్న బిఆర్ఎస్ ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పుకుంటాయి . అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతాయి. కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణాలో అధికారం చెలాయిస్తున్న బిఆర్ఎస్ ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు దిగటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రోజు అంటే శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభల్లో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు లు చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది అనే సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రైతు బంధు, దళిత బంధు తో పాటు ఉచిత విద్యుత్ కూడా ఆగిపోతుంది అని సీఎం కెసిఆర్ బహిరంగ సభల్లోనే చెపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. వాటిని పక్కన పెట్టి ప్రజల్లో భయాలు రేపి లబ్ది పొందే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నట్లు అయన మాటలు చూస్తే తెలుస్తోంది.

మరో వైపు మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ అయితే మరింత దారుణంగా ఉన్నాయనే చెప్పొచ్చు. కెసిఆర్ మళ్ళీ సీఎం కాకపోతే హైదరాబాద్ కు అమరావతి గతే పడుతుంది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తిరిగి కెసిఆర్ సీఎం కాకపోతే వ్యాపారం దెబ్బ తింటుంది అని రియల్ ఎస్టేట్ వాళ్ళు భయపడుతున్నారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కెసిఆర్ మరో సారి సీఎం కావాలని హరీష్ రావు చెప్పదల్చుకున్నారా అని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అటు కెసిఆర్, ఇటు హరీష్ రావు వ్యాఖ్యలు ఆ పార్టీ ఎంత నిరాశలో ఉందో తెలియచేస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు కెసిఆర్ ఎన్నికల్లో ఓడిపోయినా తనకు నష్టం లేదు అని...ప్రజలే వాళ్ళ కోసం తనను గెలిపించుకోవాలని అన్నట్లు చెపుతున్నారు. అదే నిజం అయితే మరి ఇంతగా హైరానా పడటం ఎందుకు...ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ఎందుకో.

Next Story
Share it