Telugu Gateway
Telangana

గత ప్రభుత్వ అక్రమాలు...అవినీతి వెలికితీతపై కాంగ్రెస్ ఫోకస్

గత ప్రభుత్వ అక్రమాలు...అవినీతి వెలికితీతపై కాంగ్రెస్ ఫోకస్
X

ప్రభుత్వం మారింది. లెక్కలు కూడా మారబోతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు..అవినీతి వంటి చిట్టాను బయటపెట్ట బోతుందా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సీఎంగా రేవంత్ రెడ్డి బాథ్యతలు చేపట్టాక చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ మాట్లాడితే అటుకులు బుక్కి...తిని తినక తెలంగాణ కోసం పనిచేశాం అంటూ చెప్పుకొచ్చేవారు. ఇందులో నిజం ఎంత అనే సంగతి పక్కన పెడితే గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలనలో...సీఎంగా కెసిఆర్ కొనసాగినంత కాలం చేసిన ఖర్చు...వచ్చిన ఫలితాలపై లెక్కలు తీయాలని కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు విద్యుత్ శాఖ కొనుగోళ్లు, ఇతర వ్యవహారాలపై కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇవే కాదు...రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన సాగునీటి శాఖతో పాటు రెవిన్యూ శాఖలో సాగిన దందాలు...ఐటి, పరిశ్రమల శాఖల లోగుట్లు...మున్సిపల్ శాఖలో నడిచిన వ్యవహారాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. ఎందుకంటే అటు కెసిఆర్, ఇటు కేటీఆర్ లు తాము పని చేసిందే తెలంగాణ కోసమే తప్ప తమకు ఎలాంటి స్వార్ధం లేదు...రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసినట్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే బిఆర్ఎస్ హయాంలో పాలన అంతా రహస్యంగా సాగింది కానీ...ప్రజలకు ఎక్కడా వాస్తవాలు తెలియనిచ్చేవాళ్లే కాదు. కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నిజంగా ఏమి జరిగిందో ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.

దీని వెనక రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పేరు చెప్పి గత ప్రభుత్వం ఏమి చేసింది అనే విషయం బయటకు చెప్పటం ద్వారా బిఆర్ఎస్ అసలు రంగు బయటపెట్టడం ఒకటి...తద్వారా రాజకీయ ప్రయోజనం పొందటం మరొకటి. ఒక పని చేస్తే చాలు...మిగతా విషయాలు అన్ని వాటంతట అవే జరిగిపోతాయి. దీంతో ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయం బిఆర్ఎస్ నేతల్లో ఉంది అని చెపుతున్నారు . రాష్ట్ర స్థాయిలో జరిగిన వ్యవహారాలే కాకుండా...జిల్లాల్లో చోటు చేసుకున్న అంశాలపై కూడా కొత్త ప్రభుత్వం దృష్ఠి సారించింది.ఇందుకు ఉదాహరణ బిఆర్ఎస్ కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి చెందిన మాల్ కు అటు ఆర్టీసీ, ఇటు విద్యుత్ శాఖ అధికారులు నోటీసు లు ఇవ్వటం. గత ప్రభుత్వంలో అప్పటి పెద్దలకు ఎంతో సన్నిహితంగా ఉన్న జీవన్ రెడ్డి అటు లీజ్...ఇటు విద్యుత్ కు సంబంధించి పది కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి బకాయి పడ్డారు. అంటే ఇది ప్రభుత్వ అండదండలు లేకుండా సాగదు అనే విషయం తెలిసిందే. ప్రభుత్వం మారటంతో అధికారులు కూడా కొరడా జులిపించటం మొదలు పెట్టారు. ఇవి అన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలన విషయంలో వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే అంటున్నారు అధికారులు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ వంటి నేతలు కొత్త ప్రభుత్వం ఏమి చేస్తుందో చూస్తాం...వాళ్లకు సహకారం అందిస్తాం అంటూ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరిన్ని కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది అనే చర్చ సాగుతుంది. మరి గత ప్రభుత్వానికి చెందిన ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో..వాటిపై కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Next Story
Share it