Telugu Gateway
Telangana

తెలంగాణ ఉద్యోగుల్లో పీఆర్సీ నివేదిక కలకలం

తెలంగాణ ఉద్యోగుల్లో పీఆర్సీ నివేదిక కలకలం
X

తెలంగాణ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట ఉద్యోగులు పీఆర్సీ ప్రతులను కాల్చివేయటంతోపాటు..చించేసి నిరసన తెలిపారు. ఈ పీఆర్సీ తమకొద్దని నినాదాలు చేశారు. పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఉద్యోగులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు పీఆర్సీ కేవలం 7.5 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేయటం షాక్ కు గురిచేసింది. దీంతో పీఆర్సీ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధర్నా చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇదిలా ఉంటే త్రిసభ్య సంఘంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీకి ముందే నివేదిక బహిర్గతం కావటంపై సర్కారు సీరియస్ గా ఉందనే వార్తలు వస్తున్నాయి. పీఆర్సీ రిపోర్టు తమను షాక్‌కు గురిచేసిందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. 63 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 7.5 శాతం సిఫార్సు చేయడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని, సీఎంతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రోజురోజుకు ఖర్చులు పెరుగుతుంటే హెచ్ఆర్ఏ ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. అసలు త్రిసభ్య కమిటీ ఏ ప్రాతిపదికన 7.5 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేశారని ఆయన ప్రశ్నించారు.

Next Story
Share it