Telugu Gateway
Telangana

తెలంగాణ అసెంబ్లీలో వెరైటీ డిమాండ్ !

తెలంగాణ అసెంబ్లీలో వెరైటీ డిమాండ్ !
X

ఎప్పుడైనా అధికార పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితులు వచ్చినప్పుడు సీఎం వెంటనే సభకు వచ్చి ప్రకటన చేయాలనే డిమాండ్స్ ప్రతిపక్షాల నుంచి రావటం చాలా సందర్భాల్లో చూశాం. కానీ ఇక్కడ అంతా రివర్స్. దేశంలో బహుశా ఓ అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కావాలని ఇంతలా డిమాండ్ చేయటం బహుశా ఇదే మొదటి సారి కావొచ్చేమో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అయన క్యాబినెట్ లోని మంత్రులు అందరూ కూడా సోమవారం నాడు శాసన సభలో ఇదే డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ డిమాండ్ లేవనెత్తుతూనే ఉన్నారు. తెలంగాణ కు అత్యంత కీలకమైన కృష్ణా జలాల వంటి అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు దూరంగా ఉండటం ఖచ్చితంగా బిఆర్ఎస్ కు నష్టం చేసే అంశమే అని చెప్పొచ్చు. రెండు టర్ములు అధికారంలో ఉన్న తర్వాత కెసిఆర్ ప్రతిపక్షంలోకి వచ్చాక ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయటానికి తప్ప అసెంబ్లీ వైపు రావటం లేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా చర్చనీయంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి దఖలు పర్చింది అని విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ఇదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పాలి కదా...అలా చేయకుండా నల్గొండ లో బహిరంగ సభకు రెడీ అవుతున్నారు కానీ...అసెంబ్లీకి రాకపోవటం వల్ల బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీ హరి తమ నాయకుడు సభకు హాజరు కాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని సభలో చెప్పారు కానీ..అవేంటో మాత్రం చెప్పలేదు.

బిఆర్ఎస్ తరపున హరీష్ రావు గట్టిగా తన వాదన వినిపించినా కూడా బిఆర్ఎస్ లో పార్టీ ఓనర్ కెసిఆర్ మాటకు తప్ప ఎవరి మాటకు విలువ ఉండదు అని...వీళ్ళ మాటలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన సభలో తెలంగాణ ప్రాజెక్ట్ లను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కు అప్పగించబోమని తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు గత పదేళ్ల కాలంలో జరిగిన వ్యవహారాలను బయటపెట్టారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం ముఖ్య కార్యదర్శి, సాగునీటి శాఖ ఇంచార్జి గా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కేంద్రానికి ఇటీవల రాసిన లేఖను కూడా సభలో చదివి వినిపించారు. కెసిఆర్ సర్కారు మాత్రమే ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది అని....ఎక్కడా దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు అని స్పష్టం చేశారు. కెసిఆర్ పాలనలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని అవినీతి సాగునీటి శాఖలో జరిగింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరో వైపు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం బయటపడటం...అవినీతి, కాగ్ నివేదికలోని అంశాలు బిఆర్ఎస్ ను...ముఖ్యంగా ఈ శాఖ వ్యవహారాలను చూసిన కెసిఆర్ ను ఇరకాటంలోకి పెట్టేవే. కెసిఆర్ నిజంగా సభకు వస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ర్యాగింగ్ మరింత ఎక్కువ ఉండేది అని...దీనికి భయపడే కెసిఆర్ సమావేశాలకు దూరంగా ఉన్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావటం అనుమానమే అనే చర్చ కూడా సాగుతోంది. అసెంబ్లీ కి రాజీనామా చేసి...లోక్ సభ లో బరిలో నిలవాలన్నాకూడా వాతావరణం ఎక్కడా అంత సానుకూలంగా లేదనే అభిప్రాయం బిఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఇప్పుడు కెసిఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి నెలకొని ఉంది.

Next Story
Share it