Telugu Gateway
Telangana

మంత్రి స‌చివాల‌య ప‌నుల ప‌రిశీల‌న‌కు కూడా సీఎం ఆదేశాలా?!

మంత్రి స‌చివాల‌య ప‌నుల ప‌రిశీల‌న‌కు కూడా సీఎం ఆదేశాలా?!
X

తెలంగాణ‌లో ప‌రిపాల‌న ఎంత కేంద్రీకృతంగా సాగుతుంద‌న‌టానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. స‌చివాల‌యం నిర్మాణం అనేది ఆయ‌న శాఖ ప‌రిధిలోనే సాగుతుంది. ఆయ‌న ఎప్పుడు అనుకుంటే అప్పుడు మంత్రిగా వెళ్లి ప‌నులు ప‌రిశీలించ‌వ‌చ్చు..అధికారుల‌కు త‌గు ఆదేశాలు ఇవ్వొచ్చు. కానీ అదేమి విచిత్ర‌మో అధికారికంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌స్తావించిన అంశాలు ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. ప్రారంభంలోనే ఇలా ఉంది స‌మాచారం. ' ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమవారం నాడు నూతన సచివాలయం నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా మంత్రి కలియతిరిగారు.ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు.మినిస్టర్స్ చాంబర్స్,ఆఫీసర్స్ చాంబర్స్,వర్క్ స్టేషన్ ఏరియా పనులు,టైల్ ఫ్లోరింగ్ పరిశీలించారు. సైడ్ వాల్ గ్రిల్స్,గ్రాండ్ ఎంట్రీ,కాంపౌండ్ వాల్ రేయిలింగ్ గ్రిల్స్(మైల్డ్ స్టీల్) లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇటీవల తెప్పించిన మెయిన్ ఎలివేషన్ ఫినిషింగ్ ఏరియాలో ఉపయోగించే దోల్ పూర్(రెడ్ సాండ్) స్టోన్ ను పరిశీలించారు. పోర్టీకో స్లాబ్ పిల్లర్లకు సంబంధించిన జీఆర్సి (GRC) క్లాడింగ్ గురించి పలు సూచనలు చేశారు.కారిడార్ ఫాల్స్ సీలింగ్ సంబంధించిన శాంపిల్స్ పరిశీలించారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల సందర్శించినప్పుడు పలు సూచనలు చేశారు.వాటికి సంంధించిన పనుల పురోగతి,నిర్మాణ శైలి మంత్రి పరిశీలించారు. నిర్మాణం ఫినిషింగ్ లో ఉపయోగించే ఇంటీరియర్ సామగ్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల ప్రకారం ఫ్లోర్ వైస్ పనులు పూర్తి నాణ్యతతో, సమాంతరంగా జరగాలని అధికారులను,వర్క్ ఏజెన్సీ ని అదేశించారు. ' అంటూ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రిత‌మే సీఎం కెసీఆర్ కూడా ఈ ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. దానికి కొన‌సాగింపుగా మంత్రి సోమ‌వారం ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఇంత వ‌ర‌కూ ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండాల్సిన అవ‌స‌రం లేదు..ఉండ‌దు. కానీ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కే మంత్రి వెళ్లి చూశారు..లేదంటే వెళ్ళ‌రు అనే త‌ర‌హాలో స‌మాచారం ఉండ‌టం ఆశ్చ‌ర్యం అన్పించ‌క‌మాన‌దు.

Next Story
Share it