Telugu Gateway
Telangana

కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్నుపోటు!

కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్నుపోటు!
X

సహజంగా వెన్నుపోట్లు తెర వెనక చోటు చేసుకొంటాయి. కానీ ఇది బహిరంగ వెన్నుపోటు. నిన్న ఆడియో... ఇవ్వాళ వీడియో. కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకర్తగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే దానికి దూరంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ లో కలకలం రేపుతోంది. దీనిపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ తరపున బరిలో నిలిచింది స్వయంగా అయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కావటం తో అయన ప్రచారానికి దూరంగా ఉంటారని భావిస్తూ వచ్చారు చాలా మంది. ఇప్పడు అదే జరిగింది. తెలంగాణ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మునుగోడు ఎన్నికల ప్రచారం వంటి కీలక విషయాలను పక్కన పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. దీనితో అందరికి క్లారిటీ వచ్చింది. అంతే కాదు ఆస్ట్రేలియా లో అభిమానుల తో మాట్లాడుతూ తన తమ్ముడు గెలుస్తాడు అని చెప్పటం, తాను ప్రచారానికి వెళ్లిన డబ్బు ఎవరు పెట్టాలి అని ప్రశ్నించటం వంటి అంశాలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ తరపున తాను ప్రచారం చేసినా ఓట్లు పెరుగుతాయి కానీ కాంగ్రెస్ గెలవదు అని చెప్పటం సంచలనం గా మారింది. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సీట్ విషయంలో చేతులెత్తిసిన వెంకటరెడ్డి తనకు పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది..అధికారంలోకి వస్తుంది అని చెపుతారు అన్న మాట.

తనకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ పరుగులు పెడుతుంది..ఇతరులు ఎవరైనా పీసీసీ లో ఉంటే మాత్రం కాంగ్రెస్ గెలవదు అని బహిరంగంగా చెప్పటం అనేది చర్చనీయాంశగా మారింది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వము లో పని చేయటం ఇష్టం లేక పోతే అయన తన దారి తాను చూసుకోవాలి కానీ పార్టీ లో ఉంటూ ఇలా వెన్నుపోట్లు పొడవటం ..పార్టీ కి నష్టం చేసేలా మాట్లాడటం సరికాదని ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. తాను చాలా సార్లు ఎమ్మెల్యే గా..ఇప్పుడు ఎంపీగా ఉన్నానని చెప్పారు కోమటిరెడ్డి. ఆయనకు ఇన్ని సార్లు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే. మరి అలాంటి పార్టీ కి కష్టకాలంలో వెన్నుపోటు పొడవటం అన్నది ఏ మాత్రం సరి కాదని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడ తేడా గా మాట్లాడినా ఆయనపై ఒంటి కాలిపై లేచే నాయకులు ఎవరూ వెంకటరెడ్డి విషయంలో మాత్రం నోరు తెరవటం లేదు.ముఖ్యంగా నల్లగొండ జిల్లా నేతలు కూడా ఎవరు నోరెత్తటం లేదు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే కాంగ్రెస్ హై కమాండ్ కు అసలు ఇవేమీ పట్టవు. మరి ఇటీవల బయటకు వచ్చిన ఆడియో, వీడియో ల అంశం పై అయినా అధిష్టానం స్పందిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. వీటిపై సమాచారం అయితే ఢిల్లీ కి పంపారు నేతలు.

Next Story
Share it