Telugu Gateway
Telangana

వ‌రంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై సిటీస్ ను విడదీయవద్దు

వ‌రంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై సిటీస్ ను విడదీయవద్దు
X

కాకతీయులు ఏలిన ఘనమైన చరిత్ర కలిగిన వరంగల్, హన్మకొండ, కాజీపేట మహానగరాలను (ట్రైసిటీస్) విడదీయవద్దని, ఇపుడు ఉన్నట్లుగానే ఒకే జిల్లా కింద ఉంచాలని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు వినతిపత్రాన్నిచ్చారు. రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరమే అతి వేగంగా అభివృద్ధి చెందిందని, కాకతీయ విశ్వవిద్యాలయం, నిట్ యూనివర్సిటీ, ఉత్తర – దక్షిణ భారత దేశానికి వారధి అయిన కాజీపేట జంక్షన్, ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులు, విద్యాలయాలు, వాణిజ్య సంస్థలు, మామునూరు ఎయిర్ పోర్టు ఉన్నదన్నారు.

ఇన్ని సౌకర్యాలున్న వరంగల్ మహా నగరాన్ని ప్రభుత్వం విడదీసి, వేర్వేరు జిల్లాల పరిధిలోకి తెచ్చే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బండి పేర్కొన్నారు. భవిష్యత్ లో ఓరుగల్లు చరిత్రను కాలగర్భంలో కలపాలని చూస్తున్నారని, విడదీతను ఆపివేసి, ఒకే జిల్లాలో కొనసాగించాలని బండి సుధాకర్ గౌడ్ సీఎస్ ను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Next Story
Share it