Telugu Gateway
Politics

కేంద్రంపై విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

కేంద్రంపై విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
X

కేంద్ర ప్ర‌భుత్వంపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌యసాయ‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. గ‌తానికి భిన్నంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. కేంద్రం విభజన చట్టం హామీలను నెరవేర్చలేదని, తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తోందని విజయసాయిరెడ్డి విమ‌ర్శించారు. బిజెపి పక్షపాత ధోరణి తో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు. సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్బంగా అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం అనంత‌రం ఢిల్లీలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. '' స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రాన్ని కోరాం. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరాం. దిశ బిల్లును క్లియర్‌ చేయాలని కోరాం. సీఆర్ డీఏ , ఏపీ ఫైబర్‌, రథం తగలబడ్డ అంశాలపై సీబీఐ విచారణ కోరాం.. ఫిరాయింపుల అంశంపై కేంద్రం వైఖరి సరిగాలేదు.

అనర్హత పిటిషన్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలను లేవనెత్తుతాం. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌పై కేంద్రం ఉద్దేశపూర్వక కాలయాపన చేస్తోంది. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలి కోరాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాం. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు కోరాం. బియ్యం సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరాం. పోలవరం, ప్రత్యేక హోదా అంశాల్లో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లును క్లియర్‌ చేయాలని కోరాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6 వేలకోట్ల విద్యుత్‌ బకాయిలు రావాలి. విద్యుత్‌ బకాయిలను ఇప్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి'' అని అన్నారు.

Next Story
Share it