Telugu Gateway
Politics

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం
X

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇమేజ్ ను మార్చటంలో భారత్ జోడో యాత్ర ఎంతో దోహదం చేసింది. ఏ పార్టీ నాయకుడు అయినా నిత్యం ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా అది ఆ నాయకుడికి...పార్టీ కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. త్వరలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాహుల్ గాంధీ యాత్ర 2 ప్రారంభం కానుంది. అయితే ఈ సారి రాహుల్ గాంధీ యాత్రకు 'భారత్ న్యాయ' యాత్ర పేరు నిర్ణయించారు. ఇది మణిపూర్ లో ప్రారంభం అయి ముంబై లో ముగియనుంది. మొత్తం మీద 6200 కిలోమీటర్ల మేర ఇది సాగనుంది. జనవరి 14న ప్రారంభం అయ్యే ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా రాహుల్ యాత్ర కొనసాగుతుంది. అయితే భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర గా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం ఇది హైబ్రిడ్ మోడ్ లో అంటే కొంత మేర పాదయాత్ర..మరి కొంత మేర బస్ ద్వారా ఈ యాత్ర తలపెట్టారు. కవర్ చేయాల్సిన ప్రాంతం ఎక్కువ ఉండటం..ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ యాత్ర గురించిన వివరాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణు గోపాల్ మీడియా కు వెల్లడించారు. 'భారత్ న్యాయ' యాత్ర ద్వారా ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించటం లేదు...ఇది రాజకీయ యాత్ర కాదు అని చెప్పినా దీని అంతిమ లక్ష్యం ఏమిటో ప్రజలు ఈజీగానే అర్ధం చేసుకోగలరు. ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రధానంగా మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో మాట్లాడుతారు అని తెలిపారు.

మణిపూర్ లో మొదలు అయ్యే ఈ యాత్ర వరసగా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ల మీదుగా చివరకు మహారాష్ట్ర చేరుకోనుంది. రాహుల్ గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా పన్నెండు రాష్ట్రాల్లో 4500 కిలోమీటర్ల యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్రంలో రెండు సార్లు అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ సారి అధికారం దక్కించుకునేందుకు ఇండియా కూటమితో ముందుకు వస్తోంది. ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తూనే సొంతంగా కూడా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే తమ మాటకు భవిష్యత్ లో విలువ ఉంటుంది అనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ పాలన, ముఖ్యంగా ప్రధాని మోడీ తీరుపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత ఉన్నా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో కాంగ్రెస్ విఫలం అవుతుంది అనే విమర్శలు ఉన్నాయి. మరి ఈ 'భారత్ న్యాయ' యాత్ర తో రాహుల్ గాంధీ కేంద్రంలోని మోడీ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను ఎంత మేర తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు...అదే సమయంలో ఆయన అందరివాడిగా ఎదుగుతారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. అయితే ఎన్నికల ముందు తలపెట్టిన ఈ యాత్ర మాత్రం కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకురావటానికి ఉపయోగపతుంది అని భావిస్తున్నారు.

Next Story
Share it