Telugu Gateway
Politics

డబ్బుకు ఓటేస్తారా...నిజాయతీకా?

డబ్బుకు ఓటేస్తారా...నిజాయతీకా?
X

తిరుపతి ఓటర్లు తేల్చుకోవాల్సిన అంశం ఇదేనని బిజెపి అభ్యర్ధి, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే తిరుపతి సమస్యలతోపాటు రాష్ట్ర అంశాలపై సభలో మాట్లాడతానని అన్నారు. అధికార పార్టీ అభ్యర్ధి గెలిస్తే ఏమి ప్రయోజనం ఉంటుందని ఆమె ప్రశ్నించారు. అయితే రత్నప్రభ గెలిచినా ఆమె కూడా కేంద్రలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్ధే అవుతారన్న విషయాన్ని విస్మరించారు. ఆమె లాజిక్ ఎన్నికల్లో వర్కవుట్ అవతుందో లేదో వేచిచూడాల్సిందే. రత్నప్రభ ఆదివారం నాడు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తన జన్మభూమి అని, కర్ణాటక తన కర్మభూమి అని ఆమె చెప్పారు. తిరుపతి ఉపఎన్నికలో అందరి సహకారంతో ముందుకు వెళతానన్నారు. సోమవారం తిరుపతి ఎంపీ స్థానానికి నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. త్వరలో తిరుపతికి జనసేన అధినేత పవన్ కూడా వస్తారని.. ప్రచారంలో పాల్గొని తనకు మద్దతు ఇస్తారని ఆమె తెలిపారు.

ప్రజలకు అభివృద్ధి దగ్గర కావడం తన అజెండాని రత్నప్రభ పేర్కొన్నారు. ''తిరుపతితో ప్రత్యేకించి చిత్తూరు జిల్లాతో నాకు చిరకాల అనుబంధం ఉంది. జనసేన బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తోంది. రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తానన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సహజం. ఎవరైనా మంచి పని చేస్తే అభినందించి ప్రోత్సహించడం నా బలహీనత. ఈ విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరిస్తా. ఎదుటివారి మీద బురద చల్లడం నా వ్యక్తిత్వానికి సరిపడదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో తిరుపతి సమస్యలపై గళం విప్పడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది.'' అని తెలిపారు.

Next Story
Share it