Telugu Gateway
Politics

హోదా ప్రస్తావిస్తూ .. పేరు స్కిప్

హోదా ప్రస్తావిస్తూ .. పేరు స్కిప్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మద్యే. బీజేపీ కూడా రేస్ లో ఉన్నా ఆ పార్టీ ఈ ఎన్నికల్లో సింగల్ డిజిట్ కే పరిమితం అవుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇది అంతా కూడా బీజేపీ స్వయంకృతాపరాధం అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. సహజంగా ఎన్నికల ప్రచారంలో విమర్శలు ఆయా పార్టీ అధ్యక్షులు, ఆయా పార్టీలు ప్రకటించే విధానాలు టార్గెట్ గా చేసుకుని సాగుతాయనే విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ తీరు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న కెసిఆర్ మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం ప్రమాదంలో పడిపోతుంది అంటూ ప్రజలను ఒక రకమైన భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సీఎం కెసిఆర్ మాత్రం తన ప్రతి ఎన్నికల సమావేశంలో మాజీ పీసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్లు అయితే తీస్తున్నారు కానీ..టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు మాత్రం ప్రస్తావించటం లేదు. కాంగ్రెస్ నేతలు ధరణి రద్దు చేస్తామంటున్నారు...రైతు బంధు దండగ అంటున్నారు అంటూ వారిపై విమర్శలు చేస్తున్నారు. పీసిసి ప్రెసిడెంట్ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని చెపుతున్నారు అని...ఇలాంటి వాళ్ళను ఎన్నుకుంటే చాలా డేంజర్ ఉంటుంది అంటూ పదే పదే కెసిఆర్ ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు. కెసిఆర్ ధరణి విషయంలో రాహుల్ గాంధీ తో పాటు పేరు ఎత్తకుండానే పీసిసి ప్రెసిడెంట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

రేవంత్ రెడ్డి పేరు దగ్గరకు వచ్చే సరికే కెసిఆర్ హోదా ప్రస్తావించి..రేవంత్ పేరు ఎత్తటం లేదు. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో నేతలు అందరి పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్న కెసిఆర్ ఒక్క రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చే సరికి మాత్రం పేరు స్కిప్ చేస్తూ విమర్శలు చేయటం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. గత కొన్ని రోజులుగా అయన ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తాజాగా రైతులు టెన్ హెచ్ పీ మోటార్లు పెట్టుకోవాలని టీపీసీసీ ప్రెసిడెంట్ చెపుతున్నాడు అని...మోటార్లు వాడి తాత ఇస్తాడా అంటూ కామెంట్ చేశారు కెసిఆర్. ఇలా రేవంత్ పేరు లేకుండా కెసిఆర్ విమర్శలు చేస్తుంటే..మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాత్రం నేరుగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఆయనపై ఉచిత విద్యుత్, ధరణి, రైతు బంధు అంశాలపై విమర్శలు చేస్తున్నారు. కెసిఆర్ తన ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించక పొయినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి ఎన్నికల మీటింగ్ లో కెసిఆర్ పై తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణాలో రైతులకు 24 గంటలు విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని...తాము బిఆర్ఎస్ నేతలు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని సవాలు విసురుతున్నారు. దీనిపై ఎక్కడా నోరు విప్పని బిఆర్ఎస్ నేతలు తాము చెప్పేదే వేదం అన్నట్లు అదే ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు.

Next Story
Share it