Telugu Gateway
Andhra Pradesh

మ్యానిఫెస్టో మాయాజాలం ఏమి చేస్తుందో అన్న భయం

మ్యానిఫెస్టో మాయాజాలం ఏమి చేస్తుందో అన్న భయం
X

ఎన్నికల ముందు ప్రతి కదలికా కీలకమే. ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయంగా అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ సూత్రం ఏ పార్టీ కైనా ఒకటే. వైసీపీ మ్యానిఫెస్టో కోసం ఆ పార్టీ అభ్యర్థులతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. శనివారం నాడు వైసీపీ మ్యానిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సహజంగా ఏ పార్టీ కి అయినా మ్యానిఫెస్టో విడుదల అయిన తర్వాత జోష్ రావాలి. కానీ అధికార వైసీపీ అభ్యర్థులకు ఇప్పుడు జోష్ సంగతి అటుంచి టెన్షన్ వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇందులో అబద్దాలను కూడా...ఎంతో అందంగా...రంగుల్లో అచ్చేసి విడుదల చేయటమే అని చెప్పొచ్చు. సహజంగా రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలో ఓటర్లకు అద్భుత ప్రపంచం చూపిస్తాయి. ఇవి నమ్మి జనం ఓట్లు వేసిన తర్వాత వాళ్లకు వాళ్లకు చుక్కలు చూపిస్తాయి. ఇది దేశంలో చాలా చోట్ల జరిగేదే. ఒక వైపు మ్యానిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి ఈ సారి మాత్రం పెద్ద మాయే చేశారు.ఎవరైనా సరే మ్యానిఫెస్టో అంటే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తామో చెపుతారు. కానీ జగన్ మాత్రం తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాలుగు సంవత్సరాలు ప్రజలకు వివిధ పధకాల కింద అందించిన మొత్తాలను కూడా కలిపి ‘ఇకపై 1 .50 లక్షలు వరకు’ అంటూ ప్రత్యేక రంగుల్లో ప్రజలకు కొత్త ప్రపంచం ఆవిష్కరింప చేశారు.

వైఎస్ఆర్ చేయత తో పాటు పలు పధకాల విషయంలో వైసీపీ అధినేత, జగన్ ఇదే తరహా మాయ చేశారు. వాస్తవానికి జగన్ మరో సారి గెలిస్తే వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతలుగా వైఎస్ఆర్ చేయత కింద అందించేది కేవలం 75 వేల రూపాయలు మాత్రమే. కానీ ఈ టర్మ్ లో ఇచ్చిన మొత్తాలను కూడా కలిపి ఇకపై 1 .50 లక్షల వరకు అంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కాపు నేస్తం విషయంలో కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యారు. ఇక్కడ కూడా ఇకపై 1 .20 లక్షల రూపాయలు అంటూ మ్యానిఫెస్టో లో మాయాజాలం చేశారు. వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో 15 వేల రూపాయల చొప్పున మొత్తం అరవై వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇది ఇకపై లక్ష ఇరవై వేల రూపాయలు ఎలా అవుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంచుమించు అన్ని స్కీముల్లో ఇదే మాయ చేశారు.

గౌరవంగా గత పధకాలు అన్నిటిని కొనసాగిస్తామని చెప్పి ఉంటే బాగుండేది అని...కానీ ఇలా మ్యానిఫెస్టో లో రంగుల్లో ప్రింట్ చేసి మోసం చేయటం అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీ అవకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉంది అనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.తొలుత జగన్ మాటలు విని...టీవీల్లో చూసి కాపు నేస్తం డబల్ చేసినట్లు కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఇందులో ఉన్న మోసం తెలుసుకుని అవాక్కు అవటం అభ్యర్థుల వంతు అయింది. ఇది కచ్చితంగా డ్యామేజ్ చేయటం పక్కా అన్న భయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. సహజంగానే వైసీపీ మ్యానిఫెస్టో అసలు రంగును టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే జగన్ కూడా తన ప్రతి మీటింగ్ లో గత టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ను చూపిస్తూ వస్తున్నా విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇందులో అంతిమ విజేతలుగా ఎవరు నిలుస్తారు అన్నది జూన్ నాలుగున కానీ తేలదు.

Next Story
Share it