Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు విడ‌దీయ‌కుండానే కొత్త జిల్లాలు

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు విడ‌దీయ‌కుండానే కొత్త జిల్లాలు
X

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ర‌క‌ర‌కాల ప్ర‌తిపాద‌న‌లు..సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో కొంత మంది ఈ వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. అధికార వైసీపీ నుంచి కూడా అక్క‌డ‌క్క‌డ విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సాగిన క‌స‌ర‌త్తుపై ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి విజ‌య్ కుమార్ సుదీర్ఘంగా వివ‌రించారు. ఆయ‌న గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ వెల్ల‌డించారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు.ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్‌ కుమార్ వెల్ల‌డించారు. 'అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నాం.

రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉంది. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయి. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాం. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాం ఉంది. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపాం' అన్నారు. కోన‌సీమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్పటి నుంచో కోరుతున్నార‌ని తెలిపారు.

Next Story
Share it