Telugu Gateway
Andhra Pradesh

ద‌గ్గ‌ర‌వ్వాల‌ని టీడీపీ..దూరం దూరం అంటున్న బిజెపి

ద‌గ్గ‌ర‌వ్వాల‌ని టీడీపీ..దూరం దూరం అంటున్న బిజెపి
X

ఎవ‌రు ఒప్పుకున్నా..ఒప్పుకోక‌పోయినా బిజెపికి ద‌గ్గ‌ర‌య్యేందుకు తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నం చేస్తుంద‌నేది వాస్త‌వం. అందుకే తెలంగాణ‌లో టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును ఈ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న బిజెపికి బ‌ద‌లాయించేలా ప్ర‌య‌త్నించి..ఏపీలో బిజెపితో పొత్తుపెట్టుకోవాల‌నే ఐడియాను ఆ పార్టీ అధిష్టానం తెర‌పైకి తెచ్చింది. ఏపీలో బిజెపితో పొత్తు వ‌ల్ల వ‌చ్చే ఓట్లు కంటే..టీడీపీ ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌పైనే ఫోక‌స్ పెట్టి దీని కోసం ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే ఏపీలో బిజెపితో ఎంతో స‌న్నిహితంగా ఉంటున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ను కాద‌నుకుని..చంద్ర‌బాబుతో పొత్తుకు సిద్ధ‌ప‌డాల్సిన బ‌ల‌మైన కార‌ణాలు ఏమీ బిజెపికి క‌న్పించ‌టంలేద‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల వాద‌న‌. గ‌త కొంత కాలంగా జాతీయ మీడియాలో టీడీపీ తిరిగి ఎన్డీయేలో చేర‌బోతుంద‌ని అంటూ త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బిజెపి పార్ల‌మెంట‌రీ పార్టీ బోర్డు స‌భ్యుడు, ఎంపీ కె. ల‌క్ష్మ‌ణ్ తెర‌దించారు. ఇది కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మేన‌ని..తెలంగాణ‌లో తాము ఒంట‌రిగానే పోటీచేస్తామ‌ని..ఏపీలో జ‌న‌సేన‌తో క‌ల‌సి ముందుకు సాగుతామ‌న్నారు.

వైసీపీపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌మ రెండు పార్టీలు ఉప‌యోగించుకుంటాయ‌న్నారు. ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌ట‌న‌తో కొంత కాలం పాటు ఈ పొత్తు ప్ర‌చారానికి ప‌డిన‌ట్లే అని చెప్పుకోవ‌చ్చు. అయితే ఎన్నిక‌ల నాటికి కూడా ఖ‌చ్చితంగా ఇదే ప‌రిస్థితులు ఉంటాయ‌ని చెప్ప‌టానికి వీల్లేదు. ఎవ‌రు..ఎప్పుడు ఎవ‌రితో క‌లుస్తార‌నేది అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఏపీలో వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల‌నీయ‌బోన‌ని జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. ల‌క్ష్మ‌ణ్ చెప్పిన‌ట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి, జ‌న‌సేన‌లు మాత్ర‌మే ఏపీలో క‌ల‌సి పోటీచేస్తే ఈ రెండు పార్టీలు క‌ల‌సి సాధించే సీట్లు కూడా ఏమీ ఉండ‌వ‌ని ఖ‌చ్చితంగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే వాటి బ‌లం చాలా ప‌రిమితం అన్న విష‌యం తెలిసిందే. అయితే వైసీపీకి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా జ‌న‌సేన‌ను బిజెపినే టీడీపీతో పొత్తు కుదుర్చుకోకుండా చేయ‌వ‌చ్చ‌నే అనుమానాలు కూడా టీడీపీ నేత‌ల్లో ఉన్నాయి. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఎన్ని మార్పులు వ‌స్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it