Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు. నారాయ‌ణ‌ల‌పై మ‌రో ఎఫ్ ఐఆర్

చంద్ర‌బాబు. నారాయ‌ణ‌ల‌పై మ‌రో ఎఫ్ ఐఆర్
X

అరెస్ట్ లు..కేసులు. ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు ఆక‌స్మాత్తుగా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాల లీకేజీకి సంబంధించి ఏపీకి చెందిన పోలీసులు మంగ‌ళ‌వారం నాడు మాజీ మంత్రి, టీడీపీ నేత పి. నారాయ‌ణ‌ను అరెస్ట్ చేశారు. ఈ విష‌యాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ నిర్ధారించారు కూడా. చిత్తూరు జిల్లాలోని నారాయ‌ణ కాలేజీ నుంచి వాట్సప్ లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు కేసు న‌మోదు అయింది. సీఎం జ‌గ‌న్ కూడా ఈ అంశంపై ఓ బ‌హిరంగ స‌భ‌లోనే నారాయ‌ణ‌, చైత‌న్య స్కూళ్ళ‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఓ వైపు ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాల కేసులో అరెస్ట్ అయిన వెంట‌నే మాజీ మంత్రి నారాయ‌ణ ఏ2గా మ‌రో కేసు న‌మోదు అయింది.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఏపీసీఐడీ పోలీసులు మ‌రో ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. ఈ కేసులో చంద్ర‌బాబునాయుడు ఏ1గా ఉంటే..నారాయ‌ణ ఏ2గా, ఏ3గా లింగ‌మ‌నేని ర‌మేష్‌, ఏ4గా లింగమనెని రాజశేఖర్ లు ఉన్నారు. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్ లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతనెల 27న మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 కింద సీఐడీ పోలీసులు వారిపై సోమవారం కేసు నమోదు చేశారు. ఈ విష‌యాలు కూడా మంగ‌ళ‌వారం నాడే బ‌హిర్గ‌తం అయ్యాయి. దీంతో ఒక్క‌సారిగా మ‌ళ్లీ అమ‌రావ‌తికి సంబంధించి కొత్త కేసులు తెర‌పైకి వచ్చిన‌ట్లు అయింది. గ‌తంలో కూడా ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి ప‌లు కేసులు న‌మోదు చేసినా కూడా టీడీపీ నేత‌లు కోర్టు నుంచి ఊర‌ట పొందారు.

Next Story
Share it