Telugu Gateway
Andhra Pradesh

అనంతపురంలో వన్ డే 'కలెక్టర్'

అనంతపురంలో వన్ డే కలెక్టర్
X

ఒక రోజు ముఖ్యమంత్రి. ఒక రోజు కలెక్టర్..ఒక రోజు ఎస్పీ. సినిమాల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అలాంటిది ఒక రోజు కలెక్టర్ వచ్చారు. అది కూడా ఏపీలోని అనంతపురం జిల్లాలో. ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతున్న అమ్మాయికి ఆ ఛాన్స్ దక్కింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించకుని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. 'బాలికే భవిష్యత్' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు.

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చీరకట్టులో వచ్చిన శ్రావణిని కలెక్టర్ కుర్చీలో కూర్చోపెట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలిక ఉండనున్నారు. అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.

Next Story
Share it