Telugu Gateway
Telangana

జనగామలోని ట్రంప్ అభిమాని మృతి

జనగామలోని ట్రంప్ అభిమాని మృతి
X

అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అభిమానులు ఉండటం ఆశ్చర్యం ఏమీ కాదు. విశేషం అంతకన్నా ఏమీ కాదు. కానీ తెలంగాణలోని జనగామలో ట్రంప్ కు వీరాభిమాని ఉండటం విశేషం. ఆయనకు ట్రంప్ అంటే అభిమానమే కాదు..ప్రాణం కూడా. ఏకంగా ట్రంప్ కు విగ్రహాలు చేయించి..పెద్ద పెద్ద ఫోటోలు చేయించి ఆయనకు పూజలు కూడా చేయించేవాడు. తన చర్యలతో బుస్స కృష్ణ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ కు ఈ మధ్య కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన కృష్ణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అదే ఆవేదనతో గుండె పోటుతో మరణించాడు. దీంతో జనగామలో విషాదం నెలకొంది. కృష్ణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను తన ఆరాధ్య దైవంగా పూజిస్తాడు. పూజలు, జలాభిషేకాలు కూడా చేసేవాడు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి, రాము లు దంపతుల కుమారుడు కృష్ణ ట్రంప్‌కు వీరాభిమాని.

2017 దీపావళి నాడు ఆయన తన ఇంట్లో ట్రంప్‌ చిత్రపటానికి పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు ఆ తర్వాత ఏకంగా తన ఇంటి ప్రాంగణంలోనే ట్రంప్ కోసం గుడికట్టాడు. ఆ గుడిలో ట్రంప్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అందుకోసం 15 మంది కూలీలు పనిచేశారు. దానికి రోజూ పూజలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు పెట్టాడు ఈ వీర భక్తుడి గురించి తెలుసుకున్న ట్రంప్ ఓసారి దీనిపై ట్వీట్ కూడా చేశారు. 'వంద కోట్ల భారతీయుల్లో క్రిష్‌ నా ప్రాణస్నేహితుడు. క్రిష్‌ నా అభిమాని. అతను నా ఫొటో ల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్‌ను త్వరలోనే కలుస్తా.'నని అప్పట్లో ట్రంప్ ట్వీట్ చేయడం కృష్ణను ఓ సెలబ్రిటీగా మార్చేసింది. కానీ ట్రంప్ ను కలవకుండానే కృష్ణ తుది శ్వాస విడిచారు.

Next Story
Share it