Telugu Gateway
Politics

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం
X

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులు అందరికీ స్టూడెంట్ కిట్స్ అందించే కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్ధులకు కిట్స్ అందించనున్నారు. దీనికి ‘జగనన్న విద్యా కానుక’ అనే పేరు పెట్టారు. సుమారు 43 లక్షల మంది విద్యార్ధినీ. విద్యార్ధులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అక్టోబర్ 8 నుంచి మూడు రోజుల పాటు ఈ కిట్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విద్యకే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. ‘‘పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారు. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌ పై గత ప్రభుత్వం ఆలోచించలేదు.

ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలి. ప్రతి విద్యార్థి గొప్పగా చదవాలని ఆశిస్తున్నాం. పేదవాడి తలరాతలు మార్చాలని 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం. అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలను ప్రతి తల్లి అకౌంట్‌లో వేస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Next Story
Share it