Telugu Gateway
Cinema

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలేవీ?!

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలేవీ?!
X

తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 15 నుంచి అసలు సినిమా హాళ్లు తెరుస్తారా?. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయలేదు. మార్గదర్శకాలు జారీ చేసినా కూడా అసలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు ఎక్కడ అన్నదే ప్రధాన సమస్యగా మారబోతుంది. టాప్ హీరోల సినిమాలు ఏవీ కూడా ఇప్పట్లో రెడీ అయ్యేవి కనుచూపు మేరలో కన్పించటం లేదు. సంక్రాంతి నాటికి ఒకటి అరా పెద్ద హీరోల కొత్త సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. అంతే తప్ప..ఇప్పటికిప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘వకీల్ సాబ్’ ఒక్కటి మాత్రం రెడీ అయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలు సంక్రాంతికి ఏ మేరకు రెడీ అవుతాయో వేచిచూడాల్సిందే. ఇప్పుడిప్పుడే ప్రముఖ హీరోలు అందరూ షూటింగ్ లకు రెడీ అయిపోయారు.

అయినా అంతా సవ్యంగా సాగి సంక్రాంతికి సినిమాలు పూర్తి అవుతాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే అంటున్నారు. సంక్రాంతి అంటే ఇంకా మూడు నెలల వరకూ వేచిచూడాల్సిందే. అప్పటి వరకూ పెద్ద సినిమా ఏదీ రెడీ అయ్యే సూచనలు కన్పించటం లేదు. రెడీగా ఉన్న సినిమాలు అయిన నాని ‘వి’, అనుష్కల ‘నిశ్శబ్దం’ రెండూ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా రిలీజ్ అయిపోయాయి. ఇప్పటికే రెడీగా ఉన్న చిన్న చిన్న సినిమాలు విడుదల చేస్తే కేంద్రం అనుమతి ఇచ్చిన 50 శాతం కాదు కదా...25 శాతం సీట్లు కూడా నిండటం కష్టమే అంటున్నారు. ఇప్పటికే మెట్రో, బస్సులు ప్రారంభం అయినా కూడా మరీ అత్యవసరం అయిన వారు మాత్రమే తిరుగుతున్నారు తప్ప...కోవిడ్ కు ముందులాగా ఎవరూ సాహసాలు చేయటం లేదు. నగరంలోని ప్రధాన హోటళ్ళను పరిశీలించినా ఇదే వాతావరణం కన్పిస్తోంది.

అలాంటిది చిన్న హీరోల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు రిస్క్ చేసుకుని థియేటర్లకు రావటం కష్టమే అని పరిశ్రమ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నారు. కరోనా వచ్చిన తొలి రోజులతో పోలిస్తే ప్రస్తుతం భయం కాస్త తగ్గుముఖం పట్టినా కూడా కనీసం తమ అభిమాన పెద్ద హీరోల సినిమాలు అయితే ఫ్యాన్స్ ఎంతో కొంత రిస్క్ చేస్తారు. కానీ సినిమాల పరంగా ఇఫ్పుడు ఆ ఛాన్స్ ఏ మాత్రం కన్పించటం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న వారి సినిమాలు అన్నీ వచ్చే సంవత్సరం వేసవి నాటికి రెడీ అయితే గొప్ప అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి అసలు థియేటర్లు ఓపెన్ చేస్తారా?. చేస్తే ఏ సినిమాలు విడుదల చేస్తారు..వాటికి ప్రేక్షకులు వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Next Story
Share it