Telugu Gateway
Andhra Pradesh

మోడీ..జగన్ భేటీ...ఏజెండాలో రాజకీయ అంశాలే కీలకం!

మోడీ..జగన్ భేటీ...ఏజెండాలో రాజకీయ అంశాలే కీలకం!
X

ఏపీ సమస్యల పరిష్కారానికి మోడీ ఈ టైమ్ లో సమయం ఇచ్చారా?.

కరోనా కష్ట కాలంలో ఏపీకి ఉదారంగా సాయం చేయటం సాధ్యం అవుతుందా?

జీఎస్టీ నష్టపరిహారం నిధుల్లోనే కోతపెట్టారు కదా?

అలాంటిది అదనపు నిధులు ఇస్తారా?

ప్రధాని నరేంద్రమోడీ కరోనా సమయంలో ఇప్పటివరకూ ఏ సీఎంకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏ సమావేశం ఉన్నా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే. చివరకు కేంద్ర కేబినెట్ సమావేశాలు సైతం చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలోనే జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఓ సీఎంకి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వటం మామూలుగా అయితే పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఈ తరుణంలో అపాయింట్ మెంట్ అన్నది ఖచ్చితంగా కీలకమైనదే. అయితే ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మాత్రమే ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇఛ్చారా?. లేక అంతకు మించిన రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఇందులో కీలకమైనది ‘రాజకీయ ఏజెండా’నే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖాముఖిగా ఎవరితో సమావేశం అవటానికి సిద్ధపడని ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్ కు నలబై నిమిషాల సమయం ఇచ్చారు. ఎప్పటిలాగానే ఏపీ సీఎం జగన్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన నిధుల సమస్య..విభజన హామీలు..పోలవరం వంటి అంశాలపైనే ప్రధాని నరేంద్రమోడీతో చర్చించారనే వార్తలు బయటకు వచ్చాయి.

ఇద్దరి సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా వైసీపీ ఎన్డీయేలో చేరవచ్చని బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నాయి. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటీడీపీని తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీయటం కోసం బిజెపి కూడా ప్రయత్నిస్తోంది. ఇందుకు ఏపీలో అధికార వైసీపీ అయితే తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సీఎం జగన్ కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం ఏపీ ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఏకరువు పెట్టారు. మళ్ళీ ఇవే అంశాలు..వినతిపత్రాలు ఇచ్చేందుకు అయితే ఈ కరోనా సమయంలో ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా?. అంటే ఖచ్చితంగా నో ఛాన్స్ అని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే రాజకీయంగా జరిగిన ఒప్పందాలు ఏంటి...నిర్ణయాలు ఏంటి అన్నది మాత్రం రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి ఓ అంచనాకు రావాల్సిందే. కొద్ది రోజుల క్రితం జగన్, అమిత్ షాల మధ్య జరిగిన భేటీలోనే వైసీపీ ఎన్డీయేలో చేరే అంశంపై చర్చ జరిగిందని.దీనికి తుది రూపు ఇవ్వటానికే ఇఫ్పుడు మోడీ, జగన్ ల భేటీ అని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it