‘నిశ్శబ్దం’ మూవీ రివ్యూ
ఈ సినిమాలో సరదా సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటే ‘అమెరికా మొత్తం తెలుగు వాళ్లతో నింపాలన్నదే నా లక్ష్యం’ అనే ఓ డైలాగ్. అంతే కాదు ఓ సీరియస్ విచారణ సందర్భంగా మీది తెనాలి..మాది తెనాలి అన్న తరహాలో ఓహ్..మీది విజయనగరమా ...మాదీ విజయనరగమే అంటూ సుబ్బారాజు, అంజలిల మధ్య వచ్చే సంభాషణ. ఇక అసలు విషయానికి వస్తే సినిమా విడుదలకు చిత్ర యూనిట్ చాలా కాలమే వేచిచూసింది. ఇక ఇఫ్పట్లో థియేటర్ల కోసం వేచిచూడటం కష్టం అని అమెజాన్ ప్రైమ్ ఓటీటీని నమ్ముకుని విడుదల చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్కశెట్టి పూర్తి స్థాయిలో నటించిన సినిమా కాబ్టటి ఆమె అభిమానుల్లో సహజంగానే కొంత క్రేజ్ ఉంటుంది. అనుష్క ఈ సినిమాలో తొలిసారి మూగ, చెవిటి అమ్మాయిగా నటించింది. సినిమా అంతా అమెరికాలోనే చిత్రీకరించటం మరో విశేషం. సినిమా కథ విషయానికి వస్తే అమెరికాలోని ఓ విల్లా అది.
ఆ విల్లాలో వరస హత్యలు. అందులో దెయ్యాలు ఉన్నాయనే అనుమానాలు. సడన్ గా 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విల్లా ఓ హత్యతో వార్తల్లోకి ఎక్కుతుంది. దీనికి కారణం సాక్షి ( అనుష్క) తో ఎంగేజ్ మెంట్ చేసుకుని సరదాగా ఓ పెయింటింగ్ చూద్దామని వచ్చిన మ్యూజిషయన్ అంటోనీ (మాధవన్) అక్కడ దారుణ హత్యకు గురవుతాడు. భయంతో బయటికి వచ్చి ఓ కారు తగిలిపడిపోయిన అనుష్కను హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ కు క్రైమ్ డిటెక్టివ్ మహ( అంజలి) చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. సాక్షి స్నేహితురాలు సోనాలిగా నటించిన (షాలినీ పాండే ) సడన్ గా మిస్ అవుతుంది. ఆమెను తన ప్రేమికుడు అంటోనినే హత్య చేశాడని సాక్షి తెలుసుకుంటుంది.
ఒక్క సోనాలినే కాదు..తన షోలకు వచ్చే వారిలో అందగత్తెలుగా ఉన్న అమ్మాయిలు చాలా మందిని అంటోని హత్య చేస్తాడు. దీనికి కారణం అమ్మాయిలు తాము ప్రేమించిన వారిని..పెళ్లి చేసుకున్న వారిని మోసం చేస్తూ సెలబ్రిటీలతో జీవితం షేర్ చేసుకోవటాన్ని తట్టుకోలేకపోవటమే అని చూపిస్తారు. మూగ, చెవిటి అమ్మాయిగా ఒక్క మాట కూడా లేకుండా తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. కాకపోతే ఆమె చాలా విషయాలను ఫోన్ వాయిస్ తో చెబుతుంది. స్క్రీన్ ప్లేలో గందరగోళం కన్పిస్తుంది. క్రైమ్ డిటెక్టివ్ కెప్టెన్ గా నటించిన మైఖేల్ మాడ్సన్ నటన ఆకట్టుకునేలా ఉంది. మాధవన్, అంజలి, సుబ్బరాజుల తమ పాత్రలకు న్యాయం చేసినా కమర్షియల్ సినిమాలను అభిమానించే ప్రేక్షలకు ‘నిశ్శబ్దం’ కనెక్ట్ కావటం కష్టమే.
రేటింగ్. 2.5/5