Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘మెగా’మిళితాభివృద్ధి’

ఏపీలో  ‘మెగా’మిళితాభివృద్ధి’
X

మెగా...రాంకీ చేరితే నవయుగా ఉన్నా ఓకేనా?

ఒప్పందం రద్దు తర్వాత ఈ పరిణామాలు పంపే సంకేతాలేంటి?

ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్న సర్కారు వైఖరి

సమ్మిళిత అభివృద్ధి. ఇంగ్లీష్ లో ఇన్ క్లూజివ్ గ్రోత్. ఒకప్పుడు రాజకీయ నేతలు పదే పదే ఈ మాట చెప్పేవారు. అందరూ ఇప్పుడు దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఏపీలో ఎందులో అయినా ‘మెగామిళితాభివృద్ధి’ అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏపీలో పనులన్నీ ఎంపిక చేసిన సంస్థలకే దక్కేవి. దీనిపై అప్పట్లో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. టీడీపీపోయి వైసీపీ వచ్చింది. అయినా సేమ్ సీన్ రిపిట్ అవుతోంది. ఏపీలో ఇప్పుడు అది సాగునీటి ప్రాజెక్టు అయినా..ఓడరేవులు అయినా..మరో పని అయినా ‘మెగామిళితాభివృద్ధి’ నిరాఘాటంగా సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే కీలక ప్రాజెక్టులు మెగాకే దక్కాయి. అందులో పోలవరం కాంట్రాక్ట్ తోపాటు..పోలవరం విద్యుత్ ప్రాజెక్టు. కోర్టులో ఉన్న విద్యుత్ ప్రాజెక్టు వివాదాన్ని ‘సెటిల్’ చేసి మెగాకు లైన్ క్లియర్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతలలో కూడా మెగా భాగస్వామి. తెరముందు వేరే కంపెనీ ఉన్నా..తెరవెనక కథ అంతా మెగానుభావులదే అని సాగునీటి శాఖ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి.

ఇప్పుడు మచిలీపట్నం పోర్టు వంతు వచ్చింది. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టును మేటాస్ నుంచి నవయుగాకు బదిలీ అయింది. ఓడరేవు కోసం ప్రతిపాదించిన భూమిని పూర్తిగా ఇవ్వకపోవటమే వల్లే పనులు ముందుకు సాగలేదన్నది నవయుగా వాదన. ఇచ్చిన భూమి తీసుకుని పనులు మొదలుపెట్టకుండా జాప్యం చేసిందనే కారణంతో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అప్పటి నుంచి తెరవెనక మంత్రాంగం సాగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఓడరేవుకు కొత్త డీల్ ఖరారు అయింది. దీని ప్రకారం మెగాకు మచిలీపట్నం ఓడరేవులో మెగాకు 40 శాతం వాటా, నవయుగాకు 26 శాతం వాటా, మిగిలిన వాటా రాంకీకీ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒప్పందం జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం తామే సొంతంగా మచిలీపట్నం ఓడరేవు ప్రాజెక్టు చేపడతామని అంటూ దీని కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పీవీ)ని ఏర్పాటు చేశారు. కానీ నవయుగా ఒప్పందం రద్దుపై హైకోర్టును ఆశ్రయించింది.

ఇప్పటికే నవయుగా ఈ ప్రాజెక్టుపై 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకూ వ్యయం చేసిందని చెబుతున్నారు. మరి ఇప్పుడు పనులు చేయటం లేదని రద్దు చేసిన సంస్థకు తిరిగి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉండటాన్ని ఎలా అనుమతించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి మెగాకు, రాంకీకి ఓడరేవుల రంగంలో ఎలాంటి అనుభవం లేదు. దీంతోపాటు నవయుగా కోర్టులో కేసు వేసి ఉండటం, ఓడరేవుల రంగంలో అనుభవం వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన నవయుగాకు జగన్ సర్కారు వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తున్నారు. అయితే అంతర్గతంగా జరిగిన సెటిల్ మెంట్ లో భాగంగా నవయుగాకు 26 శాతం వాటా ఇవ్వటంతోపాటు ఈపీసీ కాంట్రాక్ట్ ను కూడా ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్ కు సర్కారు అధికారిక ముద్ర ఎలా వేస్తుంది అన్నది ఇఫ్పుడు వేచిచూడాల్సి ఉంది.

Next Story
Share it