Telugu Gateway
Telangana

రైతుల కోసం దేవుడితో అయినా కొట్లాడతా

రైతుల కోసం దేవుడితో అయినా కొట్లాడతా
X

తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటిది నీళ్ల విషయంలో ఎలా రాజీపడతామని అన్నారు. ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన జరగనున్న అపెక్స్ కమిటీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కెసీఆర్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో.. దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని వ్యాఖ్యానించారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు. ఇరు రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it