Telugu Gateway
Andhra Pradesh

హోదాపై ప్రకటన..ఆ తర్వాత ఎన్డీయేలోకి వైసీపీ?!

హోదాపై ప్రకటన..ఆ తర్వాత ఎన్డీయేలోకి వైసీపీ?!
X

రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు అంటున్న ఢిల్లీ వర్గాలు

జరగబోయేది అదేనా?. ఎన్డీయేలో వైసీపీ చేరటం పక్కానా?. అంటే ఔననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు. ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం ‘ప్రకటన’ చేయటం..ఆ తర్వాత ఎన్డీయేలో వైసీపీ చేయటం ఖాయం అని చెబుతున్నారు. మరి టీడీపీ-బిజెపి కలసి ఉన్నప్పుడు సాధ్యం కాని హోదా ఇఫ్పుడు ఎలా సాధ్యం అవుతుందన్న ప్రశ్న బిజెపికి ఎదురుకావొచ్చు. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఏపీలో ఆ పార్టీ రాజకీయంగా ఆశలు వదులుకున్నట్లే లెక్క. అలా కాకపోయినా బిజెపి ఇప్పటికిప్పుడు ఏదో ఏపీలో ఎదిగిపోయి అధికారం దక్కించుకునే స్థితికి చేరుకోవటం అనేది కనీసం ఓ పదేళ్ళలో జరిగే పని కాదు. రాజకీయ కారణంతో అయినా..మరో కారణంతో అయినా ‘ప్రత్యేక హోదా’ ప్రకటన చేస్తే బిజెపికి కూడా ఎంతో కొంత మాట నిలబెట్టుకున్న పరువు దక్కుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర అవసరాలు..ప్రజలు అవసరాల కోణం కంటే ‘రాజకీయ అవసరాల’ పరంగానే నిర్ణయాలు తీసుకుంటాయనే విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా ప్రకటన చేసినా..ఇందులో ఏ మేరకు ఏపీకి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే.

ఇరు పార్టీల మధ్య ప్రాధమికంగా కుదిరిన ఓ అవగాహన ప్రకారం హోదా ప్రకటన చేయటానికి బిజెపి కూడా సుముఖంగానే ఉందని..ఇలా చేయటం ద్వారా రాజకీయంగా రెండు పార్టీలకు లాభం ఉంటుందని జగన్ వివరించినట్లు సమాచారం. వైసీపీ ఎన్డీయేలో చేరటం కార్యరూపం దాల్చితే ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి రావటం ఖాయం అని చెబుతున్నారు. బిజెపి, వైసీపీలు ఇంత వేగంగా ఒక్కటి కావటానికి ‘ఢిల్లీ’లోని శక్తులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ శక్తుల దూకుడుకు అడ్డుకట్ట పడాలంటే, పరస్పర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలసి ముందుకు సాగటానికి సిద్ధమైనట్లు కన్పిస్తోందని ఓ సీనియర్ నేత వెల్లడించారు. అయితే మోడీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు...వైసీపీ ఎన్డీయేలో చేరటం ఎప్పుడు జరుగుతున్నది అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. కొంత మంది కీలక వ్యక్తులు మాత్రం కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటన చేసి...వైసీపీని కేబినెట్ లోకి తీసుకోవటానికి వచ్చే మార్చి వరకూ సమయం పట్టొచ్చని చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ లోగానే పని పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఎన్ని రంగులు మారుతుందో.

Next Story
Share it