Telugu Gateway
Andhra Pradesh

స్పీకర్..వారి వ్యాఖ్యలు కోర్టులపై దాడే

స్పీకర్..వారి  వ్యాఖ్యలు కోర్టులపై దాడే
X

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తోపాటు అధికార పార్టీ నేతలు కొంత మంది న్యాయ వ్యవస్థపై స్పందించిన తీరుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది కోర్టులపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. వివిధ సందర్భాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీలు నందిగం సురేష్, విజయసాయిరెడ్డి, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ లు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. వీరు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించాయని..వీటిని కోర్టులపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. వీరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు పెడుతున్నారు..న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై రిజిస్ట్రార్ కేసు పెట్టినా పదవిలో ఉన్న వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వాళ్లను రక్షించటానికే కేసులు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని పేర్కొంది. సీఐడీ ఈ కేసు విచారణలో విఫలమైతే దీన్ని సీబీఐకి బదిలీ చేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. దీంతో తీర్పును రిజర్వ్ లో ఉంచారు. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని హెచ్చరించింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా నెలకొనలేదని హైకోర్టు పేర్కొంది. స్పీకర్‌ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్‌ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

Next Story
Share it