Telugu Gateway
Andhra Pradesh

సాక్షికి ఫస్ట్ పేజీ యాడ్స్ కోసం జీవో 2430కి తూట్లా?

సాక్షికి ఫస్ట్ పేజీ  యాడ్స్ కోసం జీవో 2430కి తూట్లా?
X

కొత్త సంప్రదాయానికి తెరతీసిన ఏపీ సర్కారు

ఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామంటూ 2430 జీవో తీసుకొచ్చింది. ఆయా శాఖలపై వచ్చిన వార్తల్లో తప్పు ఉంటే చర్య తీసుకునే అధికారం ఆయా శాఖల అధికారులకే అప్పగించారు. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చే నడిచింది. అయినా సరే సర్కారు ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. తప్పుడు వార్తలు రాయకపోతే భయం ఎందుకు అంటూ ఎదురుదాడికి దిగారు. ఇది అంతా పాత కథ. ఇప్పుడు వైసీపీ సర్కారు కొత్త సంప్రదాయానికి తెరతీసింది. గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఒక పత్రికలో వచ్చిన వార్తకు మరో పత్రికలో ఖండన యాడ్ ఇవ్వలేదు. అది కూడా కలర్ యాడ్..ఫస్ట్ పేజీలో. విచిత్రం ఏమిటంటే సదరు వార్త రాసిన పత్రికకు కూడా యాడ్ ఇచ్చారు. కానీ అందులో తమ పేరు ఉండటంతో ఆ యాడ్ ను పత్రిక యాజమాన్యం తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా విషయంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంటే అవన్నీ పట్టించుకోకుండా కొన్ని పత్రికలు పచ్చి అబద్దాలు పనికట్టుకుని రాస్తున్నాయంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి ఓ అర పేజీ యాడ్ ను సాక్షికి ఇచ్చారు. ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన వివరాల ప్రకారం సర్కులేషన్ పరంగా నెంబర్ వన్ లో ఉన్న ఈనాడు కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సాక్షి పత్రికకే సర్కారు అధిక మొత్తంలో యాడ్స్ ఇచ్చింది.

దీనికి తోడు ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్. గతంలో ఎప్పుడైనా పత్రికల్లో ఉద్దేశపూరిత కథనాలు వస్తే ఆయా శాఖల మంత్రులో..లేక అధికారులో వివరణ ప్రకటనలు మీడియాకు పంపటం, విలేకరుల సమావేశం పెట్టడం చేసేవారు. కానీ ఇఫ్పుడు మాత్రం అలా కాకుండా సర్కారు సొమ్ముతో సొంత పత్రికకు ప్రయోజనం కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకు సర్కారు తాను తెచ్చిన జీవో 2430 స్పూర్తిని దెబ్బతీసుకుంటోంది. సాక్షికి ఆర్ధిక ప్రయోజనం ఉంటుంది కాబట్టి కాసేపు దీన్ని పక్కన పెట్టేశారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఆర్అండ్ బికి సంబంధించిన టెండర్ల విషయంలో కూడా సర్కారు అంతే చేసింది. పత్రికలపై కేసులు పెడతాం పెడతాం అని బెదిరించి చివరకు ఆ టెండర్లే క్యాన్సిల్ చేశారు. తప్పు జరగనప్పుడు పత్రికల్లో వార్తలు వస్తే టెండర్లు రద్దు చేస్తారా?. కానీ తాజాగా జవహర్ రెడ్డి పేరుతో వచ్చిన యాడ్ చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఇది ఓ కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it