Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ బిజెపి చేతిలో ‘బందీ’ అయ్యారా?!

పవన్ కళ్యాణ్  బిజెపి చేతిలో  ‘బందీ’ అయ్యారా?!
X

జనసేనకు సొంత వైఖరులు ఉండవా?

ఉచిత విద్యుత్ కు నగదు బదిలీపై నోరుమెదపని జనసేనాని

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక అంశాలపై అసలు జనసేనకు వైఖరేమీ ఉండదా?. ఏపీ సర్కారు కొత్తగా ఉచిత విద్యుత్ స్థానే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే దీనిపై నిపుణుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రైతులకు నష్టం లేకపోయినా భవిష్యత్ లో కోతలు తప్పవనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఇంతటి కీలకమైన విషయంలో జనసేన ఇప్పటి వరకూ తన వైఖరి ఏమిటో నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి. బిజెపితో పొత్తు ఉంది కాబట్టి.....రాష్ట్రంలో ఉచిత విద్యుత్ స్థానే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టమని చెప్పింది మోడీ సర్కారే కాబట్టే పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడం లేదా?. లేకపోతే అసలు జనసేనకు దీనిపై వైఖరే లేదా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ చేతిలో బందీ అయ్యారా? అన్న అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని సంక్లిష్టల మధ్య ఇరుక్కున్న జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప..ఏపీలో కొత్తగా ఓట్లు ఎలా పెరుగుతాయి?.

ముందేమో అసలు బిజెపితో పొత్తు పెట్టుకున్నదే అమరావతి కోసం..జగన్ రాజధాని తరలించినా మళ్లీ మేం వెనక్కి తీసుకొస్తాం అంటూ ప్రకటనలు చేశారు. ఏపీలో బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు వచ్చాక జనసేన వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. ఒకప్పుడు పార్టీ వైఖరిగా రాజధానిగా అమరావతే ఉండాలని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘రైతులకు న్యాయం జరగాలి’ అనే నినాదం ఎత్తుకున్నారు. త్వరలో కోర్టుకు సమర్పించే అఫిడవిట్ లో ఏమి చెబుతారో వేచిచూడాల్సిందే. ఏ రాజకీయ పార్టీకి అయినా అదనపు ఓట్లు రావాలంటే ఓ ప్రత్యేక రాజకీయ ఏజెండా ఉండాలి. గతంలో ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగానే బిజెపికి దూరం జరుగుతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్..అమరావతి పేరు చెప్పి దగ్గరయ్యారు. సీన్ కట్ చేస్తే అది కూడా పోయింది.

ఓ రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ ఏపీ వచ్చే స్థానికక సంస్థల ఎన్నికల్లో అయినా..మరో ఎన్నికల్లో అయినా ఏమి చెప్పి ప్రజల ఓట్లు అడుగుతారు. కేవలం అభిమానులే ఓట్లు వేస్తే గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరూ చూశారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే అభిమానుల బలం ఒక్కటే సరిపోదు. దీనికి తోడు రాజకీయ ఏజెండా కావాలి. కానీ ఏపీకి సంబంధించిన అత్యంత కీలక అంశాలైన ప్రత్యేక హోదా, రాజధానుల వంటి అంశాల్లో మాట నిలకడ చూపించటం లేదు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై తన వైఖరి ఇది అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇది రాజకీయంగా పవన్ కళ్యాణ్ కే కాదు..ఆ పార్టీని నమ్ముకుని ఉన్న కొద్ది మంది నేతలకు నష్టం చేసే పరిణామాలే.

Next Story
Share it