Telugu Gateway
Politics

బిల్లులు చించేసి..మైకులు విరిచినా...రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఓకే

బిల్లులు చించేసి..మైకులు విరిచినా...రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఓకే
X

ఆదివారం నాడు రాజ్యసభ అనూహ్య సంఘటనల కు వేదికగా మారింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం కోసం ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండగా..విపక్షాలు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. విపక్షాలకు చెందిన ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి బిల్లుల ప్రతులను చింపి విసిరేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పోడియం వద్ద ఉన్న మైకులను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. అకాళీదళ్, ఆప్, టీఎంసీలకు చెందిన ఎంపీలు రగడకు కారణం అయ్యారు. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు పోడియం చుట్టుముట్టడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పదే పదే సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్ళాలని కోరినా వారు శాంతించలేదు. వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతారని..వీడిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది.

రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. మరోవైపు తృణమూల్‌ కాం‍గ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌‌ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. మైక్‌లను సైతం విరగొట్టారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోలానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్‌ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే ఆందోళనల మధ్యే ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను పాస్ చేసుకుంది. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లుల ఆమోదం కొనసాగింది. ఈ బిల్లుల ఆమోదం పూర్తి అయిన వెంటనే రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.వాయిస్ ఓట్ ద్వారానే ఈ బిల్లుల ఆమోద ప్రక్రియ ముగిసింది.

Next Story
Share it