Top
Telugu Gateway

జగన్ కు నమ్మకం ఉంది..ఆయనకు డిక్లరేషన్ అక్కర్లేదన్నా

జగన్ కు నమ్మకం ఉంది..ఆయనకు డిక్లరేషన్ అక్కర్లేదన్నా
X

తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తలెత్తిన వివాదంపై టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. తాను చెప్పిన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని..అందుకే ఆయనకు డిక్లరేషన్ అవసరంలేదని చెప్పినట్లు వెల్లడించారు. ‘సీఎం వైఎస్‌ జగన్‌ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న తర్వాతే పాద‌యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత తిరుప‌తి నుంచి కాలిన‌డ‌క‌న వ‌చ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుని ఇంటికి వెళ్లారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్న తర్వాతే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయనకు తిరుమల శ్రీవారి మీద మీద అపార‌మైన భ‌క్తివిశ్వాసాలు ఉన్నాయ‌న‌డానికి ఇంత‌కంటే ఆధారాలు అవ‌స‌రం లేదు. అందువ‌ల్లే ఆయ‌న డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని చెప్పాను త‌ప్ప డిక్ల‌రేష‌న్ తీసేయాల‌ని చెప్ప‌లేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజూ వివిధ మతాలకు చెందిన, వేలాది మంది భ‌క్తులు వ‌స్తారని.. వారంద‌రినీ డిక్ల‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సిందేన‌ని అడ‌గ‌లేము క‌దా? అని మాత్ర‌మే తాను మాట్లాడానని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దివంగ‌త సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ని మాత్ర‌మే తాను చెప్పాననన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని, డిక్లరేషన్‌ తీసేయాలని అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, బురదజల్లాలని చూస్తున్నారని ఆరోపించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగతున్న సమయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీ చ‌ట్టంలోని రూల్ 136 ప్ర‌కారం హిందువులు మాత్ర‌మే ద‌ర్శ‌నానికి అర్హులు. ఇక స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోద‌ల‌చిన ఇత‌ర మ‌త‌స్తులు తాము హిందూయేత‌రుల‌మ‌ని దేవ‌స్థానం అధికారుల‌కు చెప్పి త‌మంతట తామే డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని రూల్ : 137లో స్ప‌ష్టంగా ఉంది. 2014లో ప్ర‌భుత్వం జారీ చేసిన మెమో ప్ర‌కారం ఎవ‌రైనా గుర్తించద‌గిన ఆధారాలు ఉన్న‌వారైతే దేవ‌స్థానం అధికారులే డిక్ల‌రేష‌న్ అడుగుతారు. గ‌తంలో అనేక‌మంది ఇత‌ర మ‌తాల‌కు చెందిన రాజ‌కీయ‌, అధికార ప్ర‌ముఖులు స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన సంద‌ర్భంలో డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేదన్నారు.

Next Story
Share it