Telugu Gateway
Politics

కరోనా నియంత్రణకు అహోరాత్రులు కష్టపడుతున్నాం

కరోనా నియంత్రణకు అహోరాత్రులు కష్టపడుతున్నాం
X

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం నాడు కరోనా అంశంపై చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కెసీఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల తీరును తప్పుపట్టారు. ఈ విపత్కర సమయంలో రోగుల నుంచి ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఇది దుర్మార్గం అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఐఏఎస్ అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. టాస్క్ ఫోర్స్ తీసుకునే చర్యల వివరాలను వారానికి ఒక సారి కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎంలకు పంపిస్తామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క లేవనెత్తారు. దీంతో పాటు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం కెసీఆర్ హామీ ఇఛ్చారు. ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకం అని..ఇది తాము ప్రవేశపెట్టలేదని..దివంగత రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని..108 కూడా ఆయన తెచ్చిందే అన్నారు. మంచి ఎవరు చేసినా తాము వాళ్లకు క్రెడిట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటామని..అంతే తప్ప చిల్లర రాజకీయాలు చేయమని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కరోనా నియంత్రణకు అహోరాత్రాలు కష్టపడుతున్నామని సీఎం కెసీఆర్ ప్రకటించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని..ఏ మాత్రం ఏమరుపాటుగా కూడా ఉండొద్దని అన్నారు. కరోనా బాధితులకు వైద్యసేవలు. సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా మరణాలు దాచటం సాధ్యం అవుతుందా? అని కెసీఆర్ ప్రశ్నించారు. మరణాలు దాస్తున్నారని ప్రచారం చేస్తున్నారని కెసీఆర్ విమర్శించారు. ఎవరైనా మృతి చెందితే కుటుంబ సభ్యులు, వాళ్ల బంధువులకు తెలియదా? అని ప్రశ్నించారు. డబ్బులకు గతి లేని స్థితిలో రాష్ట్రంలేదని..ప్రజల ఆరోగ్యానికి మించి తమకేమీ ప్రాధాన్యత కాదన్నారు. కరోనాపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం నడించింది. ఎంతో తీవ్ర సమస్య అయిన కరోనాపై సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయిస్తామనటం సరికాదని అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు ఏమి సమాచారం కావాలంటే ఆ సమాచారం ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని..గట్టిగా అరిస్తే ఏమీకాదని వ్యాఖ్యానించారు.

Next Story
Share it