Telugu Gateway
Politics

పీవీకి భారతరత్న..తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

పీవీకి భారతరత్న..తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
X

మాజీ ప్రధాని, దివంగత నేత పీ వీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎంఐఎం తాము పీవీకి భారతరత్న ఇచ్చే తీర్మానానికి వ్యతిరేకం అని..సభలో కూడా తాము చర్చలో పాల్గొనబోమని ప్రకటించింది. దీంతో సభలో ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానం ఇలా ఉంది...‘ తెలంగాణ బిడ్డ, దక్షిణాదినుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతికోవిదులు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు.

భారత రాజకీయాలలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు కి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలనీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించాలనీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది.’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభలో సీఎం కెసీఆర్ తోపాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు పీవీ ఔన్నత్యం గురించి వివరించారు.

Next Story
Share it