Telugu Gateway
Telangana

తెలంగాణ కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ కొత్త రెవెన్యూ బిల్లుకు  అసెంబ్లీ ఆమోదం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది. నూతన రెవెన్యూ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఎలాంటి మార్పులు లేకుండా ప్రభుత్వం తెచ్చిన బిల్లులు యతాతథంగా ఆమోదం పొందాయి. అసెంబ్లీలో ప్రధాన పక్షాలుగా ఉన్న ఎంఐఎం ఈ రెవెన్యూ చట్టానికి పూర్తి మద్దతు తెలపగా..కాంగ్రెస్ పార్టీ దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేసి..అభ్యంతరాలు లేవనెత్తింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు శాసనసభ స్పీకర్‌ పోచారం ప్రకటించారు. సభలో మూజువాణి ఓటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. నూతన చట్టం ఆమోదంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ప్రక్రియ కూడా జరగనుంది.

కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగనుంది. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టమని అన్నారు. సభలో విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలకు సీఎం కెసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇఛ్చారు. సహజంగా మార్పులు వచ్చినప్పుడు కొంత వ్యతిరేకత వస్తుందని..ఇది ప్రారంభం మాత్రమే అని..ఇంకా ఎన్నో మార్పులు రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it