Telugu Gateway
Andhra Pradesh

‘లెక్క’ తేలాకే బస్సు కదిలేది..చెరో 250 బస్సులకూ నో

‘లెక్క’ తేలాకే బస్సు కదిలేది..చెరో 250 బస్సులకూ నో
X

తెలంగాణ, ఏపీల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని తేల్చలేకపోయాయి. అత్యంత రద్దీ ఉంటే హైదరాబాద్-విజయవాడ రూట్లలో ముందు చెరో 250 బస్సు సర్వీసులు ప్రారంభిద్దామని ఏపీఎస్ఆర్టీఎస్ ఎండీ కృష్ణబాబు ప్రతిపాదన తెలంగాణ అధికారుల ముందు పెట్టారు. అయితే లెక్క తేలిన తర్వాతే బస్సు సర్వీసులు ముందుకు కదులుతాయని చెప్పారని కృష్ణబాబు సమావేశం అనంతరం మీడియాకు వివరించారు. ఇలా ప్రతిష్టంభన ఏర్పడటం ప్రైవేట్ బస్సులు లాభపడతాయని కృష్ణబాబు పేర్కొన్నారు. కిలోమీటర్ల ప్రాతిపదికన నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే.. రూట్ వైజ్ ప్రాతిపదికన నడపాలంటూ తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు.

రూట్ వైజ్ బస్సులు నడపటం దేశంలో ఎక్కడా లేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వ్యాఖ్యానించారు. కిలోమీటర్ల ప్రాతిపదికన మాత్రమే అంతరాష్ట్ర సర్వీసులున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏపీ బస్సులు 71 రూట్లలో నడుస్తోంటే.. ఏపీలో తెలంగాణ బస్సులు 28 రూట్లలో మాత్రమే నడుస్తున్నాయన్నారు. తెలంగాణ పెట్టిన రూట్ వైజ్ ప్రతిపాదనపై స్టడీ చేస్తామని వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మరోసారి ఈడీల స్థాయిలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. రూట్ వైజ్ ప్రాతిపదికన మాత్రమే ఏపీకి బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. రూట్ వైజ్ నడిపితేనే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలకు లాభం చేకూరుతుందని సునీల్ శర్మ తెలిపారు.

Next Story
Share it