Telugu Gateway
Cinema

నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
X

టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు. ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. విలన్ గా, కమెడియన్ గా జయప్రకాష్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ నుంచి ఆయన గుంటూరులో ఉంటున్నారు. మంగళవారం ఉదయం బాత్ రూమ్ కి వెళ్లి కుప్పకూలిపోయారు. 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. రంగస్థల నటుడిగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి... రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, టెంపర్‌, సరైనోడు తదితర సినిమాల్లో నటించారు. విలన్‌గా, కమెడియన్‌గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్‌) పేరుతో ఇటీవల ఓ సినిమాను కూడా నిర్మించారు. జయప్రకాశ్‌రెడ్డి నటించిన చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు.

Next Story
Share it