Telugu Gateway
Politics

మూడు కోట్ల తేడా..టాటాకే పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్ట్

మూడు కోట్ల తేడా..టాటాకే పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్ట్
X

ప్రతిష్టాత్మకమైన భారత పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఎల్ అండ్ టి, టాటా ప్రాజెక్టులు ఈ టెండర్ దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. అయితే ఎల్ అండ్ టి కంటే మూడు కోట్ల రూపాయలు తక్కువ కోట్ చేయటం ద్వారా ఈ పనులు దక్కించుకుంది. ఎల్ అండ్ టి ఈ పని కోసం 865 కోట్ల రూపాయలతో బిడ్ చేయగా, టాటా ప్రాజెక్ట్స్ 861.90 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. దీంతో ఈ కాంట్రాక్ట్ టాటా ప్రాజెక్ట్స్ వశమైంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ రోజు ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేసింది. పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పనుల శాఖ అంచనా వేసింది.

ఇదిలా ఉంటే బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని 118వ నెంబర్‌ ప్లాట్‌లో 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన భవనం కొలువుతీరనుంది. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

Next Story
Share it