Telugu Gateway
Andhra Pradesh

విద్యుత్ సంస్కరణలకు కెసీఆర్ నో...జగన్ ఎస్

విద్యుత్ సంస్కరణలకు కెసీఆర్ నో...జగన్ ఎస్
X

జీఎస్టీ పరిహారంపై ఏపీ సర్కారు మౌనవ్రతం ఎందుకో?

తెలంగాణతోపాటు ఏపీలో ఉచిత విద్యుత్ అమలు అవుతుంది అంటే అది దివంగత రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయమే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ నిర్ణయాన్ని కదిలించే పరిస్థితి లేదు. దీనికి రెండు కారణాలు ఒకటి రాజకీయం అయితే..మరోకటి అత్యంత సున్నితమైన రైతుల అంశం కావటం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాదు..దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఉచిత విద్యుత్ కు సంబంధించి నగదు బదిలీ వంటి సంస్కరణలను అమలు చేయబోమని తేల్చిచెప్పారు. కానీ విచిత్రంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా ఎఫ్ఆర్ బిఎం పరిమితి పెంచాలంటే పలు సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం నిబంధనలు పెట్టింది. దీంతో జగన్ సర్కారు దీనికి జై కొట్టింది.

సర్కారు ఏటా ఉచిత విద్యుత్ కింద రైతులపై 8400 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెడుతోంది. ఇప్పుడు అంతే మొత్తం రైతుల ఖాతాల్లో వేస్తాం..ఆ మొత్తమే బిల్లులు చెల్లిస్తే సరిపోతుందని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మళ్ళీ ఏపీ సర్కారు తన ఖర్చులతో స్మార్ట్ మీటర్లు పెట్టి అదనపు ఖర్చు భరించాల్సిన అవసరం ఏముంది?. సహజంగా సంస్కరణలు అంటేనే రాయితీల్లో కోతలు పెట్టే ప్రక్రియ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికిప్పుడు రైతులకు వచ్చే ఇబ్బంది లేకపోయినా రాబోయే రోజుల్లో పలు ఆంక్షలు రావటం ఖాయం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. అసలు ఏమీ లేనప్పుడు ఇంత భారీ కసరత్తు చేయాల్సిన అవసరం ఏముందని ఓ అధికారి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మరో కీలక అంశం.

కరోనా దెబ్బతో రాష్ట్రాలు అన్నీ ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వలేమని....కేంద్రం రాష్ట్రాల ముందు రెండు అప్పుల ప్రతిపాదనలు పెట్టింది. ఈ ప్రతిపాదనలపై విపక్షాలకు చెందిన రాష్ట్రాలు అన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కెసీఆర్ ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ కూడా రాశారు. తెలంగాణ సర్కారు అయితే చట్టంలో ఉన్న ప్రకారం జీఎస్టీ పరిహారం ఇవ్వకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించటానికి కూడా వెనకాబడబోమని ప్రకటించింది. తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ విచిత్రంగా సకాలంలో ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న ఏపీ సర్కారు మాత్రం జీఎస్టీ అంశంపై నోరు తెరిచి గట్టిగా మాట్లాడటం కానీ..కేంద్రానికి తన నిరసన తెలియచేయకపోవటం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ పరిహారం రాష్ట్రాల చట్టబద్ద హక్కు అయినా కూడా ఏపీ మాత్రం ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తోంది. ఇదే ఇఫ్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it