Telugu Gateway
Andhra Pradesh

అంతర్వేది ఘటన..పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు

అంతర్వేది ఘటన..పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అంతర్వేదిలో రథం దగ్దం అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని..రిటైర్డు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ పై వైసీపీ సర్కారు స్పందించకపోతే సీబీఐ విచారణ కోరతామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు..‘మొన్న పిఠాపురం.. కొండబిట్రగుంట... ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్ఛికాలు కావు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు... రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయి. మతిస్థిమితం లేనివారి పని.. తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా?. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలి. ఇతర మతాల పెద్దలూ ఈ ఘటనలను ఖండించాలి. అంతర్వేది ఘటనలో ఉగ్రవాద కోణం ఉంటే ఎన్.ఐ.ఏ. దృష్టి సారించాలి. హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని ఖచ్చితంగా ఆపాలి.

ప్రార్ధనా మందిరాలను అంటే ఏ మత ప్రార్ధనా మందిరాలను అయినా సరే ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిగానీ, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారా అన్న ఒక భావజాలాన్ని ప్రవేశ పెట్టారు. ఇది చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికీ సమానం. ఏ మతానికి కానీ , ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా. ఈ క్రమంలో మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయి. హిందూ ధర్మాన్ని వెనుకేసుకొస్తే నువ్వు లౌకికవాదివి కాదు అంటారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఖండిస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు అంటారు.

మరే మతం మీద దాడి జరిగినా విగ్రహాలను పాడు చేసినా, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా... నువ్వు గొంతేసుకుని నిలబడితేనే సెక్యులర్ వాదివి. ఇలాంటి మౌఢ్యంతో కూడిన పడికట్టు భావజాలాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట.. ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..? హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే కాదు గత ప్రభుత్వాలు కూడా చాలా తప్పులు చేశాయి’. అని పేర్కొన్నారు.

Next Story
Share it