Telugu Gateway
Politics

కొత్త ట్విస్ట్..రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై అవిశ్వాసం

కొత్త ట్విస్ట్..రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై అవిశ్వాసం
X

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం పొందిన తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో జరిగిన చర్చపై సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత ఓటింగ్ పెట్టాలని కోరినా కూడా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఏ మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో విపక్షాలు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్ తోపాటు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ వంటి పార్టీలు ఈ నోటీసుపై సంతకాలు చేశాయి. దీంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. 12 పార్టీలు కలసి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ మీడియాకు వివరించారు.

దేశ చరిత్రలో ఇది చీకటి రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా మూజువాణి ఓటుతో ఆమోదింపచేశారు. ఓటింగ్ జరపాలని పార్టీలు..సభ్యులు కోరినా వైస్ ఛైర్మన్ పట్టించుకోలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలకు, సంప్రదాయాలకు డిప్యూటీ ఛైర్మన్ తూట్లు పొడిచారని ఆరోపించాయి. టీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నాయకుడు కె. కేశవరావు కూడా రాజ్యసభలో బిల్లుల ఆమోదం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బిల్లుల ఆమోదం తీరు దారుణం అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it