Top
Telugu Gateway

విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్ కాళ్ళు పట్టుకో

విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్ కాళ్ళు పట్టుకో
X

చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో విచారణ ఎదుర్కొనే దమ్ము లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవచ్చు కదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ కాళ్లు పట్టుకుని కూడా విచారణలు ఆపి వేయించుకున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని.. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారని అన్నారు. అందుకే తమ ఆస్తులను కాపాడుకునేందుకే అమరావతినే రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందే చెప్పామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నాని తెలిపారు. కొందరు తమ స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని.. వ్యవస్థల పనితీరుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ‘చంద్రబాబు బినామీలు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొన్నారు.

అమరావతి భూ కుంభకోణంపై .. సీబీఐ దర్యాప్తు చేయాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఏ రాజకీయ నేత తీసుకోలేని నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్ధేశంతోనే ముఖ్యమంత్రి నిజాయితీగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు రాకుండా టీడీపీ సిగ్గు లేకుండా అడ్డుపడుతోంది. కేవలం తాను, తన సామాజిక వర్గమన్నదే చంద్రబాబు లక్షణం. రాజధాని పేరుతో నాడు చంద్రబాబు పెట్రో సెస్ విధిస్తే.. ఎల్లో మీడియా కళ్లు మూసుకుందా ? రహదారుల మరమ్మతుల కోసం సెస్ వేస్తే.. అదేదో మహాపాపమన్నట్లు చిత్రీకరిస్తారా?' అంటూ ధ్వజమెత్తారు.

'ఐదేళ్లలో 840 బార్లను ఓపెన్‌ చేసిన చరిత్ర చంద్రబాబుది... తన పాలనలో దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు.. దళితులకు అన్యాయం చేసినందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు దళిత శంఖారావమని చంద్రబాబు పిలుపు ఇస్తే నమ్మాలా? చంద్రబాబు దళిత ద్రోహి.. సీఎం హోదాలో ఉండి దళితుడిగా ఎవరైనా పుడతారా? అని అడిగిన వ్యక్తి చంద్రబాబు.. దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే వారే బాబుకు బుద్ధి చెబుతారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలను .. సీఎం జగన్ నెరవేరుస్తూ ప్రజలకు అండగా ఉన్నారు’ అని తెలిపారు.

Next Story
Share it