Telugu Gateway
Andhra Pradesh

అమరావతి రైతులకు ఇది హెచ్చరికా?

అమరావతి రైతులకు ఇది హెచ్చరికా?
X

కొడాలి నాని వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటి?

అసెంబ్లీ మూడు రాజధానుల ఆమోదంలో నాని లేరా?

‘అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు. ఇదే విషయాన్ని సీఎం జగన్ కు చెప్పా. చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు.’ ఇదీ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటన. మూడు రాజధానులకు అసెంబ్లీలో చట్టం చేసి..గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కొడాలి నాని ఇప్పుడు అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దనటం వెనక అంతరార్ధం ఏమిటి?. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హైకోర్టులో కేసు కారణంగా పెండింగ్ లో పడిపోయింది. ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అంటూ ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులకు నాని ప్రకటన ఓ హెచ్చరికా?. ఇంతే గొడవ చేస్తే అమరావతిలో అసెంబ్లీ కూడా ఉండదని చెప్పే బెదిరింపా?. వైసీపీ ప్రభుత్వమే మూడు రాజధానులు అని ప్రకటించింది. అందులో అమరావతిలో శాసనసభ రాజధాని అని ప్రకటించారు. ఆ బిల్లులకు మంత్రివర్గం.. అసెంబ్లీ ఆమోదం పొందాయి. అందులో మంత్రి కొడాలి నాని కూడా భాగస్వామే.

ఆ నిర్ణయాల్లో భాగస్వామి అయిన కొడాలి నాని ఇప్పుడు అమరావతిలో 55 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇఛ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకు రావటాన్ని మంత్రి తప్పుపట్టారు. అమరావతిలో ఉన్నవి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు. ఇప్పుడు వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రకటన అక్కడ ఎక్కడ ఏమి వస్తుందో..ఏమి రాదో ఎవరికీ తెలియని పరిస్థితి. ఒక రాజధానిని మూడుగా మార్చేసి..అసలు అక్కడ ఏమి చేస్తారో సీఎం స్థాయిలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రైతులకు క్లారిటీ ఇవ్వకుండా ఇళ్ళ పట్టాలు అడ్డుకున్నారు కాబట్టి అమరావతిలో శాసన రాజధాని వద్దని సాక్ష్యాత్తూ ఓ మంత్రి ప్రకటన చేయటం. సీఎం కూడా చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పటం ద్వారా రైతులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలు పంపటం వంటిదేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత కాలం మంత్రుల దగ్గర నుంచి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అమరావతిలో కూడా రాజధాని ఉంటుందని ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మంత్రుల్లో ఓ మంత్రి ఇళ్ళ స్థలాలకు అడ్దుకున్నారు కాబట్టి అది కూడా ఇక్కడ వద్దు అని ప్రకటించటం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Next Story
Share it