Telugu Gateway
Andhra Pradesh

ఎక్కడా లేని డిక్లరేషన్ రూల్ తిరుమలలోనే ఎందుకు?

ఎక్కడా లేని డిక్లరేషన్ రూల్ తిరుమలలోనే ఎందుకు?
X

దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి

చంద్రబాబుకు అప్పుడు లేని అభ్యంతరం..ఇప్పుడెందుకు?

గత సంఘటనలకు చంద్రబాబు క్షమాపణలు చెబుతారా?

ఏపీలో దేవాలయాల ఘటనల వెనక టీడీపీ నేతలు ఉన్నారనే సమాచారం

ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తిరుమలలో అన్యమతస్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా లేని ఈ నిబంధన తిరుమలలోనే ఎందుకు? అని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్తులు వెంకటేశ్వరస్వామిపై నమ్మకంతో దర్శనం చేసుకుంటే ఆ ప్రాంతం ఏమైనా అపవిత్రం అవుతుందా?. డిక్లరేషన్ అంశంపై హిందువుల మత పెద్దలతోపాటు అందరూ ఓ సారి ఆలోచించాలని సూచించారు. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలన్నారు. కొడాలి నాని ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా..వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు ప్రతిపక్ష నేతగా జగన్ ఎన్నోసార్లు తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారని..అప్పుడు లేని అభ్యంతరం చంద్రబాబుకు ఇఫ్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు గతంలో తాను చేసింది తప్పు అని క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు.

ఈ నిబంధన కూడా అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు పెట్టిందే కదా? అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాతే కావాలనే చంద్రబాబు ఈ వివాదాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు. ‘హిందూ వాదులు, మతపెద్దలు అడగడం లేదు....చంద్రబాబు మాత్రమే అడుగుతున్నారు. చర్చికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరూ ఏసు ప్రభువు ను నమ్ముతావా అని సంతకం అడగలేదు. మసీదుకు కూడా వెళ్లా. అల్లాపై నమ్మకంతోనే వెళ్లా. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమే....ఆ విధానం తీసేయాలి. సీఎం హోదాలో వెళ్లే వ్యక్తిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదు. ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు!? దాన్ని తీసేయాలి. జగన్ సర్కారు వచ్చినందునే ఇప్పుడు టెస్ట్ చెయ్యాలి....బ్లడ్ తీయాలి అంటున్నారు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!?. నిజమైన హిందూ వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అభ్యంతరాలు లేవు.

చంద్రబాబు జగన్ ని చూసి చంద్రబాబు కుళ్లికుళ్ళి ఏడుస్తున్నాడు. గౌరవం పొందే స్థానం లో చంద్రబాబు లేడు... అందుకే నిత్యం తిడుతున్నా. చంద్రబాబు ను రోడ్డుమీద ప్రజలు బూతులు తిడుతున్నారు. దేవాలయాల పై వరుస ఘటనల విషయం లో టీడీపీ నేతల పై అనుమానాలు ఉన్నాయి. పోలీసు నుంచి ఆమేరకు సమాచారం కూడా మాకు ఉంది. 10 కేజీల వెండి బొమ్మలు ఎత్తుకు పోతే...కోటి రూపాయల రథం పోతే దేవుడికి పోయేది ఏమి లేదు. ఇది అంతా వాళ్ళు చేస్తున్న పనే. లేకపోతే మేమే చేసుకుని..మేమే అందరితోమాటలు పడతామా? హిందువులకు మేము ఛాంపియన్ లు అని టీడీపీ, బీజేపీ, జనసేనలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ’ అని వ్యాఖ్యానించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బిజెపికి చెందిన ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న నాయకులు మాట్లాడుతున్నారు. సోము వీర్రాజు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కోరలేదు. ఆయన ఎవరికీ డిక్లరేషన్ అక్కర్లేదు అన్నట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై మాత్రమే మాట్లాడారని తెలిపారు.

Next Story
Share it