Top
Telugu Gateway

చంద్రబాబుపై నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై నాని సంచలన వ్యాఖ్యలు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెళ్ళటానికి సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ, బిజెపిల తీరును ఆక్షేపించారు. సీఎం జగన్ తిరుమల వెళ్ళేది హిందువుల ప్రతినిధిగా కాదని..ఆరు కోట్ల ప్రజల ప్రతినిధిగా అని వ్యాఖ్యానించారు. కొడాలి నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బూట్లు వేసుకుని తిరుమల కొండ ఎక్కితే.. సీఎం జగన్‌ చెప్పులు లేకుండా తిరుమల కొండ ఎక్కారని తెలిపారు. ‘‘తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా..? ఎడమ చేత్తో భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు హిందువులా?. చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నారా?’’ అంటూ మంత్రి నిలదీశారు. తాను ఏనాడూ దేవుళ్లను కించపరచలేదని, ఆంజనేయ స్వామిపై నేను ఒకటి మాట్లాడితే.. టీడీపీ మరొకటి దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.

సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు తిరుమల వెళ్లారు. భవిష్యత్‌లో కూడా వెళతారు. టీడీపీ, బీజేపీలు హిందువులు పేరుతో రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్‌కు అన్ని మతాలు, కులాలు ఒక్కటే. నా మెడలో అన్ని మతాల దండలు వేసుకుంటాను. నాకు అన్ని మతాల ప్రజలు ఓట్లేస్తేనే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యానని’’ కొడాలి నాని పేర్కొన్నారు. తాను డిక్లరేషన్ కు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని...తాను తప్పేమీ మాట్లాడలేదన్నారు. దీనికి చంద్రబాబుకు, సోము వీర్రాజుకు క్షమాపణలు చెప్పాలా? అని ప్రశ్నించారు.

Next Story
Share it