Telugu Gateway
Politics

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు
X

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారారు. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ గా ఉన్న కుంతియాను తొలగించి.. ఆయన స్థానంలో మాణికం ఠాగూర్‌ను అధిష్ఠానం నియమించింది. అంతే కాదు..కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. కాకపోతే ఆయన అత్యంత కీలకమైన సీడబ్ల్యూసీలో మాత్రం సభ్యుడిగా కొనసాగనున్నారు. సీనియర్ల అసమ్మతి లేఖ తర్వాత అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు కీలకంగా మారాయి. సీడబ్ల్యూసీని కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం పునర్‌ వ్యవస్థీకరించింది.

ఆజాద్‌తో పాటు అంబికాసోని, మోతీలాల్‌వోరా, మల్లికార్జున ఖర్గేను కూడా అధిష్టానం ఇన్ ఛార్జ్ పదవుల నుంచి తొలగించింది. ఇప్పటి వరకూ యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్‌ గా ఆజాద్ వ్యవహరించారు. అయితే.. పార్టీలోని సీనియర్లు, కీలక నేతలుగా వ్యవహరించిన వారందర్నీ ఇలా పక్కనెట్టడం గమనార్హం. అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆజాద్ కానీ, ఖర్గే కానీ ఇంతవరకూ స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కాంగ్రెస్ సిడబ్ల్యుసి మెంబర్‌గా మాజీ ఎంపీ చింతా మోహన్‌ను సోనియాగాంధీ నియమించారు. ఏపీ నుంచి ఒకే ఒక్కరికి స్థానం కల్పించడం జరిగింది.

Next Story
Share it