వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరపరుస్తారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..ప్రభుత్వాన్ని ఎవరైనా ఎలా అస్ధిరపరుస్తారు అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనపై విచారణ జరిపించాలని కోరితే మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న వారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం ఆలయాల విషయంలో చోటుచేసుకొంటున్న దాడులు, దుశ్చర్యలపై విచారణ చేసి ఎందుకు నిందితులను పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని కొంత మంది అర్థం లేని వాదన వినిపిస్తున్నారు. ఆలోచించి మాట్లాడండి. 151మంది ఉన్నారు కదా... మిమ్మల్ని ఎవరు అస్థిరతకు గురిచేస్తారు.
వరుసగా చోటుచేసుకొంటున్న ఈ ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? భక్తుల మనోభావాలు కాపాడండి. ఒక భావోద్వేగంతో బయటకు వచ్చారు. తమ మిత్ర పక్షం భారతీయ జనతా పార్టీ నాయకత్వం శుక్రవారం ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని దీనికి తమ మద్దతు ఉంటందని ప్రకటించారు. తొలుత కరోనా అని ఆలోచించినా భావోద్వేగాలను, మనోభావాలను కించపరచడంతో ప్రజలే బయటకు వచ్చినప్పుడువారితో అనుసంధానం కావాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలి. మీ మనసులు గాయపడ్డాయి... ఎక్కడా భావోద్వేగాలను లోను కావద్దు. ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలియచేసే హక్కు ఉంది” అని వ్యాఖ్యానించారు.